logo

Telangana News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై సధాకర్‌ కథనం ప్రకారం మెట్‌పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీశ్‌ (31) హైదరాబాద్‌లో

Updated : 15 Mar 2022 08:51 IST

బర్ల హరీశ్‌

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై సధాకర్‌ కథనం ప్రకారం మెట్‌పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీశ్‌ (31) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఏడాదిన్నర కిందట ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారం క్రితం మెట్‌పల్లికి వచ్చిన హరీశ్‌ ఆదివారం సాయంత్రం తన స్నేహితులు ఫోన్‌ చేసి రమ్మన్నారని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. ఆదివారం రాత్రి హరీశ్‌ వెల్లుల్ల శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోయాడని ఆయన చిన్నాన్న కుమారుడికి స్నేహితులు సమాచారమిచ్చారు. సమీపంలోని వ్యవసాయ తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం దూసుకుపోయి హరీష్‌ బావిలో, వెనుక కూర్చున్న యువకుడు గట్టు వైపు పడిపోయారని తెలిపారు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించారు. సోమవారం తెల్లవారుజామున బావిలో నుంచి హరీశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి ముక్కు, తల వెనుక భాగం, చెవుల వద్ద రక్తం కారడంతో కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఐ శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పన్నెండేళ్ల క్రితం..
సుమారు పన్నెండేళ్ల క్రితం హరీశ్‌కు సోదరుడయ్యే చిన్నాన్న కుమారుడు అభిషేక్‌ కూడా బావిలో పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్‌ కూడా అదే రీతిలో బావిలో విగత జీవిగా మారడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్రంగా కలచివేసింది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో హరీశ్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని