logo

సభాపర్వానికి సన్నద్ధం

కొత్త ఏడాదిలో సర్కారు విధానసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్‌ను ఆహ్వానించనున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి

Published : 28 Jan 2022 01:29 IST

ఫిబ్రవరి 14న షురూ.. 25న ముగింపు

మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : కొత్త ఏడాదిలో సర్కారు విధానసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్‌ను ఆహ్వానించనున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి ఈ సమావేశం తర్వాత ప్రకటించారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశాలకు కూడా సర్కారు సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తదుపరి మంత్రివర్గ సమావేశం తర్వాత చర్చిస్తామన్నారు. బీబీఎంపీ, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలు, విద్యా వికాస తదితర కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలిలా..

ఎన్నికలకు సిద్ధం

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. బీబీఎంపీ ఎన్నికల కోసం నగర మంత్రులు, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మంత్రులంతా సమన్వయంగా పని చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన విధానసభ, పరిషత్తు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమన్వయం కొరవడినట్లు వస్తున్న ఆరోపణలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎమ్మెల్యేలకు అప్పగించాల్సిన బాధ్యతలపై మంత్రులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఆరు నెలలుగా శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రత్యేక కరదీపికలను ముద్రించనున్నారు. త్వరలో నందిబెట్టలో నిర్వహించే పార్టీ చింతనా సమావేశంలో శాఖల ప్రగతిపై సమీక్షిస్తారు.

కరోనా నియంత్రణ వ్యవస్థ, పాఠశాలల నిర్వహణపై మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. మరోమారు నిపుణుల సమితితో చర్చించి నిబంధనల సడలింపుపై తీర్మానిస్తారు. వలయాల వారీగా చేపట్టిన సమీక్షలు, తాజా కేసులు, మరణాల ప్రమాణాలపై సమీక్షలు నిర్వహిస్తారు.

మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విస్తరణ, పార్టీ ఫిరాయింపులపై బహిరంగ వ్యాఖ్యలు తగదని మంత్రులకు సూచించారు.

2021-22 ఏడాది విద్యా వికాస కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.93.27 కోట్లలతో ఉచిత సమవస్త్రాలు పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలోని వివిధ కారాగృహాల్లో శిక్ష అనుభవిస్తున్న 166 మంది ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా విడుదల భాగ్యం..

కర్ణాటక అటవీ అభివృద్ధి, అటవీ పారిశ్రామిక ఉత్పాదన సంస్థల విలీనం..

రామనగర, చెన్నపట్టణ ప్రభుత్వ పట్టు శిక్షణ సంస్థల ఆవరణలలో నాబార్డ్‌ సహకారంతో రూ.75కోట్ల వ్యయంతో హైటెక్‌ పట్టు గూళ్ల మార్కెట్ల స్థాపన..

కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి నిధులతో కలబురగిలోని సేడం జాతీయ రహదారిలో రూ.49 కోట్ల వ్యయంతో పై వంతెన, రహదారి విస్తరణ పనులకు పాలనామోదం.

చాముండి దేవస్థాన భక్తుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.92.81కోట్ల నిధులు..

బెంగళూరు దక్షిణ తాలూకా బేగూరు హొబళ్లిలో 4.19 ఎకరాల భూమిని రాష్ట్ర గూఢాచారి వ్యవస్థ శిక్షణ అకాడమి స్థాపనకు ఆమోదం.

వసతి వితరణ పథకాల్లో హక్కు పత్రాల పరిశీలన, వ్యవసాయ భూముల దస్త్రాలు, పట్టణ, నగర ఆస్తుల పత్రాల సమాచారం సిద్ధం చేసేందుకు అర్హులైన ప్రైవేటు ఏజెన్సీలతో సమీక్ష.. ఇందుకు రూ.287 కోట్ల నిధులకు ఆమోదం..

400 మంది పశువైద్యుల నియామకాలకు అనుమతి..

వర్తూరు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.488 కోట్ల కేటాయింపు.

చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలో అమలులో ఉన్న 131 గ్రామాల బహుగ్రామ తాగునీటి పథకాన్ని జిల్లాలోని మరో 32 గ్రామాలకు విస్తరించేందుకు రూ.22 కోట్ల మంజూరు.

చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలో 300 జనవసతి తాగునీటి వ్యవస్థల కోసం రూ.392 కోట్ల కేటాయింపు.

అమృత మహోత్సవాల పథకాల్లో భాగంగా రాష్ట్రస్థాయి అమలు సమితి ఏర్పాటు.

మంగళూరు నగరాభివృద్ధి పరిధిలో 45.85 ఎకరాల భూమిలో సర్కారు లేఅవుట్‌ల కోసం రూ.30.50 కోట్లు విడుదల.

హుబ్బళ్లి ధార్వాడ పాలికె పరిధిలో ఆర్యభట్ట ఐటీ పార్కులో మిగులు మూడు ఎకరాల భూమిని మూడు ఐటీ, బీటీ కంపెనీలకు వితరణ.

యాదగిరి జిల్లా గురుమిఠ్‌కల్‌ క్షేత్రంలోని భీమా నది పరివాహక ప్రాంతంలో 20 చెరువుల పునరుద్ధరణకు రూ.165 కోట్ల విడుదలకు నిర్ణయం.

బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పరిధిలో కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజీ పునరుద్దరణకు రూ.35 కోట్ల కేటాయింపు కోసం డీపీఆర్‌ ఆమోదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు