icon icon icon
icon icon icon

రాజసం కష్టమే

రాజస్థాన్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకుని అసాధారణ విజయం సాధించిన భాజపాకు ఈసారి హ్యాట్రిక్‌ కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ కొంత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముందని తెలుస్తోంది.

Published : 25 Apr 2024 04:25 IST

రాజస్థాన్‌లో భాజపా హ్యాట్రిక్‌ అసాధ్యమేనా..
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

రాజస్థాన్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను గెలుచుకుని అసాధారణ విజయం సాధించిన భాజపాకు ఈసారి హ్యాట్రిక్‌ కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ కొంత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 19న జరిగిన పోలింగ్‌పై ఆ పార్టీ కొంత ఆశాభావంతో ఉంది. కనీసం 6 చోట్ల తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంటోంది.

అత్యల్ప పోలింగ్‌ ఎవరికి లాభం?

19వ తేదీన 12 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 58 శాతం పోలింగే నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 10శాతం తక్కువ. దీంతో 26వ తేదీన ఎన్నికలు జరిగే 13 నియోజకవర్గాల్లో భారీ పోలింగ్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని భాజపా నాయకత్వం నేతలకు సూచించింది.

కాంగ్రెస్‌ ఏమంటోంది..

‘రాష్ట్రంలో మోదీ ప్రభంజనం లేదని భాజపా అర్థం చేసుకుంది. అత్యల్ప పోలింగ్‌ నమోదే ఇందుకు నిదర్శనం. మరోవైపు కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది. వారంతా వచ్చి ఓటేశారు. తొలి విడత పోలింగ్‌ జరిగిన 12 నియోజకవర్గాల్లోని సగం చోట్ల కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలను సాధించబోతోంది. దీంతో మరింత ఉత్సాహంతో రెండో విడతకు సిద్ధమవుతున్నాం. భాజపాను ఆశ్చర్యానికి గురిచేసే ఫలితాలు ఇక్కడ వస్తాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు భాజపా నేతలంతా హ్యాట్రిక్‌ విజయాల్ని అందించాలని రాజస్థాన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రజలు హ్యాట్రిక్‌ను ఎండమావిగా మార్చేందుకు సిద్ధమయ్యారు. అందుకే తన ప్రచార సభల్లో మోదీ.. ‘ఈసారి 400కుపైగా సీట్లు’ అనే నినాదాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌పై వివాదాస్పద విమర్శలకు దిగుతున్నారు. మైనారిటీలపై వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు పేర్కొన్నారు.

 

భాజపా ఏమంటోంది..

‘అత్యల్ప పోలింగ్‌ భాజపా అవకాశాలను దెబ్బ తీస్తుందనేది అపోహే. పోలింగ్‌ తక్కువ జరిగిందని అంగీకరిస్తున్నాం. వివాహాలు, ఎండలవల్ల ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు రాలేదు. మోదీపై నమ్మకమున్న భాజపా ఓటర్లు భారీగా ఓటేశారు. పోలింగ్‌ విషయంలో మాకేం భయం లేదు. అసంతృప్తి లేదు’ అని ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ శర్మ స్పష్టం చేశారు.


సచిన్‌ పైలట్‌ ఉద్ధృత ప్రచారం

కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ రాష్ట్రంలో ఉద్ధృత ప్రచారం చేస్తున్నారు. ఆయన గుజ్జర్లు, మీనాల మద్దతు కూడగడుతున్నారు. ఇది టోంక్‌-సవాయ్‌ మాధోపుర్‌, దౌసా, భీల్‌వాఢా, రాజ్‌సమంద్‌, ఆజ్‌మేర్‌లలో కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశముంది.  

రెండో విడతలో..

  • రెండో విడతలో భాగంగా 26వ తేదీన టోంక్‌- సవాయ్‌ మాధోపుర్‌, అజ్‌మేర్‌, పాలి, జోధ్‌పుర్‌, బాడ్‌మేర్‌, ఝాలోర్‌, ఉదయ్‌పుర్‌, బాంస్‌వాడా-దుంగార్‌పుర్‌, చిత్తోడ్‌గఢ్‌, రాజ్‌సమంద్‌, భీల్‌వాడా, కోటాలలో పోలింగ్‌ జరగనుంది.
  • మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ గహ్లోత్‌, వసుంధర రాజె ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వారు తమ కుమారుల నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
  • ఝాలోర్‌-సిరోహీలో మోదీ, గహ్లోత్‌ మధ్య పోరు సాగుతున్నంతగా పోటీ నెలకొంది.
  • తొలి విడతలో గహ్లోత్‌ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా వసుంధర మాత్రం తన కుమారుడి నియోజకవర్గమైన ఝాలావర్‌-బారాకే పరిమితమయ్యారు. పార్టీ నిర్లక్ష్యం చేయడంతో ఆమె అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
  • కోటాలో ప్రహ్లాద్‌ గుంజాల్‌ నుంచి స్పీకర్‌ ఓం బిర్లా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
  • కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ శెఖావత్‌ జోధ్‌పుర్‌లో, కైలాశ్‌ చౌధరి బాడ్‌మేర్‌లో తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img