బిడ్డ పేరే మర్చిపోయిన మస్క్‌

ప్రముఖ అమెరికన్ పారిశ్రామిక వేత్త ఎలాన్‌ మస్క్‌ విభిన్నంగా ఉంటూ వార్తల్లో నిలుస్తారు.

Published : 12 Sep 2020 01:40 IST

పాస్‌వర్డ్‌లా ఉందంటూ నవ్వేశారు


కాలిఫోర్నియా: ప్రముఖ అమెరికన్ పారిశ్రామిక వేత్త ఎలన్‌ మస్క్‌ విభిన్నంగా ఉంటూ వార్తల్లో నిలుస్తారు. కాగా, అప్పట్లో ఆయన తన కుమారుడికి పెట్టిన చిత్రమైన పేరు నెట్టింట్లో చక్కర్లు కొట్టగా..ఇప్పుడు ఆయనే ఆ పేరు మర్చిపోవడం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..

ఇటీవల జర్మనీలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీని వీక్షించడానికి వచ్చిన సమయంలో మస్క్‌ ఆకస్మికంగా విలేకరులతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఓ విలేకరి X AE A-12 ఎలా ఉన్నాడంటూ ప్రశ్నించారు. దాంతో తనను దేనికి గురించి అడుగుతున్నారో అర్థం కాక మస్క్‌ కాస్త తికమకపడ్డారు. మరోసారి అడగాలంటూ కోరారు. ఆ వెంటనే విలేకరి అడిగిన విషయం ఏంటో అర్థమై, పెద్దగా నవ్వేశారు. ‘ఓ మీరు అడిగింది నా కుమారుడి గురించి కదా! అది నాకు ఒక పాస్‌వర్డ్‌ చెప్పినట్లు అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈసారి వచ్చేప్పుడు తన కుమారుడిని కూడా తీసుకువస్తానని అన్నారు.

కాగా, మే నెలలో తనకు కుమారుడు జన్మించినట్లు మస్క్‌ ప్రకటించారు. అలాగే ఆ పిల్లాడికి X AE A-12 అని పేరు పెట్టి ఆశ్చర్యపర్చారు. ఆ పేరు అర్థం ఏంటని అడగ్గా మస్క్‌ సహచరి గ్రిమెస్‌ వివరణ ఇచ్చారు. ‘X’ అంటే ఊహకందని మనస్తత్వానికి నిదర్శనం, ‘AE’ అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌, ‘A-12’ అంటే తమకు ఇష్టమైన ఎస్‌ఆర్-17  విమానం వేగానికి ప్రతీక, ఇంకా A అంటే ఆర్కేంజిల్ పాటకు గుర్తుగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తరవాత ఎస్‌ఆర్-17 కాదని, ఎస్‌ఆర్-71 అంటూ సరిచేశామని తెలిపారు. ఆ పేరును ఎలా పలకాలంటూ అప్పట్లో నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని