కొత్త మాస్క్‌ గురూ.. రాగితో కరోనాకు చెక్‌!

కరోనా‌ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్‌ను నాశనం చేయగల.....

Updated : 30 Oct 2020 13:26 IST

బోస్టన్: కరోనా‌ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్‌ను నాశనం చేయగల సామర్థ్యంతో ఓ కొత్త తరహా మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాడుతున్న మాస్కులు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అవి గాలిని శుభ్రం చేసి వైరస్‌ను కట్టడి చేయలేవని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. తాము మరింత ముందుకు వెళ్లి రాగి, ఉష్ణోగ్రత ఆధారంగా కరోనా వైరస్‌ను నశింపచేసే మాస్కులను కనిపెట్టినట్టు తెలిపారు.   

రాగి మాస్క్ ఎలా పనిచేస్తుంది?

ఈ మాస్క్‌లో ఓ మెష్ (వల)‌ మాదిరిగా రాగి పొర ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాగిలో సహజంగానే యాంటీ వైరల్‌ లక్షణాలుంటాయి. వీటిని వాడేవారు ఊపిరి పీల్చి వదిలినప్పుడు ఇందులో మెష్‌ నుంచి గాలి ప్రసరిస్తుందని వివరించారు. ఈ గాలిలో వైరస్‌ ఉంటే.. ఈ మెష్‌లో అధిక ఉష్ణోగ్రత వల్ల నశిస్తాయని చెబుతున్నారు. వైరస్‌ను చంపేందుకు అవసరమైనంత వేడిని సృష్టంచేందుకు 9 వోల్టుల బ్యాటరీ తదితర ఏర్పాట్లు కూడా ఇందులో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రత్యేక మాస్కును మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చని వివరించారు. 

ఎవరికి ఉపయోగం?

ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, సామాజిక దూరం పాటించటం వీలు కాని విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ మాస్కులు అత్యంత ఉపయోగమని అంటున్నారు. బస్సులు, రైళ్లు తదితర జనంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు.ఈ మాస్క్‌ల నమూనాలను రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించే పని మొదలైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని