వాయుకాలుష్యంతో గర్భస్రావం ముప్పు

భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని గర్భిణులపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని సర్వేలో తేలింది. ఈ మేరకు మోడెలింగ్‌ స్టడీ నివేదికలు లాన్సెంట్‌ ప్లానేటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Updated : 07 Jan 2021 18:24 IST

వెల్లడించిన లాన్సెంట్‌ సర్వే

దిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని గర్భిణులపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని సర్వేలో తేలింది. ఈ మేరకు మోడెలింగ్‌ స్టడీ నివేదికలు లాన్సెంట్‌ ప్లానేటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు ప్రమాణాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వాయుకాలుష్యం నమోదవుతుందని తెలిపారు. దీంతో సంవత్సరంలో సుమారు 3 లక్షలకు పైగా గర్భస్రావాలు, శిశు మరణాలు ఈ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని వెల్లడించారు. 29శాతం గర్భస్రావాలకు ఈ వాయుకాలుష్యమే కారణమని తెలిపారు.

 ‘‘దక్షిణాసియాలో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంది. అదే విధంగా ఈ ప్రాంతం ప్రపంచంలోని కాలుష్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. మా సర్వేలో తేలిందేంటంటే వాయుకాలుష్యం గర్భస్రావాలు, గర్భధారణ సమయంలో సమస్యలకు ప్రధాన కారణంగా ఉంది. దీనిపై వెంటనే సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.’’ అని ఈ సర్వేలో సభ్యురాలైన టావో సూ తెలిపారు. ‘‘ గర్భస్రావం జరగటం, జన్మించిన వెంటనే శిశువు మరణించడం వంటివి మహిళలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. మానసికంగా, శారీరకంగా ఇంకా ఆర్థికంగా కూడా వారు చాలా కోల్పోతారు. దీని ద్వారా వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం కూడా ఉంది.’’ అని చైనీస్‌ అకాడెమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన టియాంజిన్‌ గువాన్‌ తెలిపారు. వాయుకాలుష్యం వల్ల గర్భాన్ని పోగొట్టుకోవడం అనేది భారత్‌, పాకిస్థాన్‌ వంటి ప్రాంతాల్లో చాలా సాధారణంగా జరుగుతోందని ఈ సర్వే వెల్లడిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, 30 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. 
ఈ సర్వే కోసం 1998 నుంచి 2016 వరకూ అన్ని రకాల ఆరోగ్య నివేదికలు, వాతావరణ మార్పులను పరిశీలించినట్లు వారు వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం వాయుకాలుష్యంతో గర్భాన్ని పోగొట్టుకున్న వారిలో భారత్‌లో 77శాతం, పాకిస్థాన్‌లో 12 శాతం, 11శాతం బంగ్లాదేశ్‌ మహిళలు ఉన్నారు. గాలిలో 10 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌లో స్మాల్‌పర్టిక్యులర్‌ మాటర్‌ పెరిగే కొద్దీ మహిళల్లో గర్భం కోల్పోయేందుకు 3 శాతం అవకాశముందని వారు తెలిపారు. ప్రపంచారోగ్య సంస్థ నిబంధనలు పాటిస్తూ వాయుకాలుష్యాన్ని అదుపులో ఉంచితే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని వారు తెలిపారు.

ఇవీ చదవండి..

సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని