రథం దగ్ధంపై సీబీఐ విచారణకు ఉత్తర్వులు

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దివ్య రథం ఆహుతైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు...

Updated : 11 Sep 2020 12:27 IST

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దివ్య రథం ఆహుతైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. ఈనేపథ్యంలో అంతర్వేది ఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఇవాళ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. నిజాలు నిగ్గు తేల్చేందుకే రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించామని హోం మంత్రి సుచరిత తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదన్నారు.

 సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన  దివ్య రథం ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటాక ఆహుతైంది. 40 అడుగులు ఎత్తు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ. అయితే.. రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. రథం ఆహుతైన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా, జనసేన, విశ్వహిందూపరిషత్‌, పలు హిందూ సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. భాజపా, జనసేన చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం  సీబీఐ విచారణకు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని