TS News: వ్యాక్సిన్‌ పంపిణీలో తెలంగాణ ముందంజ: హరీశ్‌రావు

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 10 Jan 2022 16:36 IST

చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రారంభం

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చార్మినార్‌ యునానీ ఆస్ప్రతిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలిసి బూస్టర్‌ డోస్‌ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తుందని చెప్పారు. మొదటి డోస్‌ సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15-18 ఏళ్ల మధ్యవారిలో కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయిందని మంత్రి వివరించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. 

యునానీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించామని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హరీశ్‌రావు చెప్పారు. నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మంజూరయ్యేలా చేస్తామన్నారు. ఆస్పత్రిలోని ఖాళీలను పూరించేందుకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. రోగులకు వీలైనంత వరకు ఇక్కడే సేవలందించాలని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌లో ముందంజలో ఉన్న వైద్యఆరోగ్యశాఖకు అభినందనలు తెలిపారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని.. దాంతోపాటు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో దుష్పరిణామాలు వస్తాయన్నది అవాస్తవమని.. అలాంటి మాటలు నమ్మొద్దన్నారు.  యునానీ ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావును అక్బరుద్దీన్‌ కోరారు. 

హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారు. గతంలో తీసుకున్నవారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. రెండో డోస్‌ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారితో పాటు 60 ఏళ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని