Cm Jagan: దావోస్‌ వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్‌

Published : 14 May 2022 02:31 IST

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్‌ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు జగన్‌ తెలిపారు. అయితే జగన్‌ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దావోస్‌ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సీఎం జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సును ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని బృందం ‘ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలు... ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న ప్రధాన అంశంతో సదస్సులో పాల్గొననుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ దావోస్‌ సదస్సుకు సంబంధించి రాష్ట్ర లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను గురువారం ఆవిష్కరించారు. ‘‘మన రాష్ట్రం తరఫున ఏపీ పెవిలియన్‌ థీమ్‌ ఏర్పాటు చేసి, 18 అంశాలను ప్రదర్శిస్తాం. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్‌ వేదికగా అందరికీ తెలియజేస్తాం.  దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో మేమంతా సమావేశం కాబోతున్నాం. సీఎం వస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది’ అని మంత్రి అమర్‌నాథ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని