AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ

విజయవాడలోని వాణిజ్యపన్నుల శాఖ ఒకటో డివిజన్‌లోని నలుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్టు చేసింది.

Updated : 31 May 2023 22:31 IST

విజయవాడ: విజయవాడలోని వాణిజ్యపన్నుల శాఖ ఒకటో డివిజన్‌లోని నలుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్టు చేసింది. ఈఎస్‌ఐకు చెందిన పన్ను వసూళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నమోదు చేసిన అధికారులు.. నలుగురు ఉద్యోగులు మెహర్‌, సంధ్య, సత్యనారాయణ, చలపతిరావులను అరెస్టు చేశారు. రూ.200 కోట్ల మేర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండికొట్టారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అదనపు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఓ సంఘం ధర్నాకు దిగిన వ్యవహారంలోనూ ఈ నలుగురు ఉద్యోగులు ఉండటంతో వీరికి గతంలో సంజాయిషీ నోటీసులు జారీ అయ్యాయి.

ఉద్యోగుల అరెస్టుపై సీఎస్‌ స్పందించాలి: సూర్యనారాయణ

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్టు వ్యవహారంపై సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావులు స్పందించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వమని తాము గవర్నర్‌ను కలిసినందుకు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు మానుకోవాలని కోరుతున్నామన్నారు. రెండేళ్ల క్రితం ఓ పత్రికలో వచ్చిన వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెండ్‌ చేశారన్నారు. ఏపీ హైకోర్టు ఆ సస్పెన్షన్లను కొట్టివేసిందని గుర్తు చేశారు. ఏ కేసులో ఉద్యోగులను అరెస్టు చేశారో? ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్‌లు, అరెస్టులు చేస్తే ఉద్యోగులు ఎవరూ భయపడరన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఉద్యోగుల అరెస్టుపై నోరు మెదపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇంత అరాచకంగా ప్రవర్తించడం న్యాయమా అని ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని