Nimmagadda: ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి ఏపీని చులకన చేయొద్దు: నిమ్మగడ్డ రమేశ్‌

ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరిచి దేశం దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చులకన చేయొద్దని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోరారు.

Updated : 10 Dec 2023 18:42 IST

తిరుపతి: ఓటర్ల జాబితాలో లోపాలను సవరించాల్సిన బాధ్యత సీఈవోపై ఉందని ఏపీ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. లోపాలను సవరించకుండానే ఏపీలో ముసాయిదా జాబితా విడుదల చేశారని గుర్తు చేశారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఎల్వోలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని, ప్రస్తుత బీఎల్వోలు మాత్రం రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అనుభవం ఉన్నవారికి బీఎల్వోగా బాధ్యతలు అప్పగిస్తే తప్పిదాలు పునరావృతం కావని సూచించారు. గంపగుత్తగా ఓట్ల తొలగింపులు చెల్లబోవని సీఈవో చెప్పారని, దీనిపై విచారణ చేయాలని కలెక్టర్లను కూడా ఆదేశించారని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్‌ గుర్తు చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరిచి.. దేశం దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ను చులకన చేసుకోవద్దని ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. వ్యవస్థాగతంగా వారికి ఉన్న హక్కులను గుర్తు చేసేందుకు, వారి హక్కులను సాధించేందుకు గల మార్గాలను సుగమం చేయడానికి సిటిజన్‌ ఫర్‌ డమోక్రసీ ప్రయత్నం చేస్తుందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో రాజ్యాంగ పాలన జరగడం లేదు.  ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడటంతో ప్రశ్నించడానికే సీఎఫ్‌డీ ఏర్పడింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరుగుతున్నాయి. గతంలో లేని విధంగా ఓటర్ల జాబితాపై విమర్శలు ఉన్నాయి. జాబితా తయారీలో సిబ్బంది వ్యవహారమే విమర్శలకు కారణం. ఓట్లను గంపగుత్తగా తొలగించకూడదన్న సీఈసీ నిబంధనలు అమలు కాలేదు. రాజ్యాంగ విరుద్ధంగా వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరును గవర్నర్‌ దృష్టికి సీఎఫ్‌డీ తీసుకెళ్లింది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం సలహాదారులను నియమించింది. ప్రభుత్వ సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు’’ అని నిమ్మగడ్డ తెలిపారు

పాలకులే న్యాయం చేయకపోతే పౌరులు ఎక్కడికి వెళ్లాలి?: ఎల్వీ సుబ్రహ్మణ్యం

పాలకులే న్యాయం చేయకపోతే పౌరులు ఎక్కడికి వెళ్లాలని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ పాలన జరగకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోయి శ్రీలంక దివాలా తీసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పౌరులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని సంపాదించడం ఎంత కష్టమో.. ప్రజాస్వామ్యబద్దంగా బతకడం కూడా అంతే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు