Andhra News: మా వెనుక రాజకీయ పార్టీలు లేవు: ఉపాధ్యాయ సంఘాలు

ఫిట్‌మెంట్‌ విషయంలో తేడా రావడం వల్లే పీఆర్‌సీ సాధన సమితి నేతలతో విభేదించామని ఫ్యాప్టో ఛైర్మన్‌ సుధీర్‌బాబు అన్నారు. తమ వెనుక రాజకీయ నేతలు ఉన్నారని

Updated : 10 Feb 2022 04:22 IST

విజయవాడ: ఫిట్‌మెంట్‌ విషయంలో తేడా రావడం వల్లే పీఆర్‌సీ సాధన సమితి నేతలతో విభేదించామని ఫ్యాప్టో ఛైర్మన్‌ సుధీర్‌బాబు అన్నారు. తమ వెనుక రాజకీయ నేతలు ఉన్నారని మాట్లాడటం సరికాదన్న ఆయన... తమ క్యాలెండర్లు, డైరీలు ఏటా సీఎం ఆవిష్కరించడం సంప్రదాయమని పేర్కొన్నారు. పీఆర్‌సీ సాధన సమితి నేతలపై అనుచితమైన ప్రచారం చేయొద్దని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. 

‘‘శవ యాత్రలు, పిండ ప్రదానాలు చేయవద్దని ఉపాధ్యాయులను కోరుతున్నాం. ప్రతి సమస్యపై పోరాటానికి ఎన్‌జీవో హోంను ఉపయోగించుకుంటాం. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పనిచేయాలనే ప్రతిపాదన మాదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచన మాకు లేదు. ఫిట్‌మెంట్‌ 30శాతం కావాలని మొదటి నుంచి కోరుతున్నాం. మా డైరీలు, క్యాలెండర్లు సీఎం ఆవిష్కరించడం సంప్రదాయం. మా వెనుక ఎవరూ లేరు. ఫిట్‌మెంట్‌, గ్రాట్యుటీలో తేడా వచ్చింది... అందుకే, విభేదించి బయటకు వచ్చాం. ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్లను సీఎంకు వివరిస్తామంటే... ఆ ఆవకాశం లేదని మంత్రులు చెప్పారు. అందుకే సమావేశం నుంచి బయటకు వచ్చాం. అటెండెన్స్‌లో మాత్రమే మేం సంతకం చేశాం. ఒప్పందంపై సంతకం పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. ఫిట్‌మెంట్‌, గ్రాట్యూటీ చెల్లింపుపై మంత్రుల కమిటీతో విభేదించాం. 90శాతం సమస్యలు ప్రభుత్వం పరిష్కరిచిందని చెబుతున్నాం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాం. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరూ పాల్పడవద్దు. రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు’’ అని సుధీర్‌బాబు అన్నారు. పీఆర్సీపై ఎవరూ సంతృప్తిగా లేరని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ అన్నారు. బయోమెట్రిక్‌, పోలీసు ఆంక్షలతో తమపై నిర్బంధాలు విధించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసేందుకు సీఎంను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని