Agnipath Protest: పిల్లలు సికింద్రాబాద్‌ వెళ్తున్నట్లు తెలియదు: తల్లిదండ్రుల ఆవేదన

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని చంచల్‌గూడ జైల్‌లో ఉన్న నిందితుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు

Updated : 20 Jun 2022 15:27 IST

ములాఖత్‌లతో కిక్కిరిసిన చంచల్‌గూడ జైలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిని విడుదల చేయాలని కన్నీరుమున్నీరయ్యారు. వారు సికింద్రాబాద్‌కు వెళ్తున్నట్లు తమకు తెలియదన్నారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చంచల్‌గూడ జైలుకు చేరుకొని ములాఖత్‌లో వారి పిల్లలను కలుసుకున్నారు. ములాఖత్‌ కోసం ఇప్పటికే 300మంది కుటుంబ సభ్యులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 46మందిని పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్లను విచారిస్తున్న పోలీసులు..

మరోవైపు సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసును హైదరాబాద్‌ పోలీసులకు రైల్వే పోలీసులు బదిలీ చేశారు. అల్లర్లతో సంబంధం ఉందని భావిస్తున్న వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సభ్యులను అడ్మిన్లు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాదిలో విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్థరించారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు.. యువకులను రెచ్చగొట్టిన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏయే కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు సీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీని సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని