APCRDA: ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడివారైనా ప్లాట్లు కొనుక్కోవచ్చు.. సీఆర్‌డీఏ కీలక ప్రకటన

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు కోసం సీఆర్‌డీఏ మరోమారు ప్రకటన జారీ చేసింది. ఈ ప్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలోని ఎక్కడివారైనా కొనుగోలు చేయొచ్చని సీఆర్‌డీఏ ప్రకటించింది.

Updated : 25 Mar 2023 21:45 IST

మంగళగిరి:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. మంగళగిరిలోని నవులూరు వద్ద మధ్యాదాయ వర్గాల కోసం వేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్‌లో ప్లాట్ల కొనుగోలు కోసం మరోమారు ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. లేఅవుట్‌ వేసి రెండేళ్లు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జగనన్న లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లను, 20శాతం రాయితీని ఇస్తున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ గతంలోనే తెలిపారు. అయితే,  ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అయినా.. జగనన్న లేఅవుట్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.  ఎంఐజీ లేఅవుట్‌లో 200 చదరపు గజాల ప్లాట్లు 58, 240 చదరపు గజాల ప్లాట్లు 188 అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్లాట్‌లలో చదరపు గజానికి రూ.17,499గా ధర నిర్ధారించగా.. ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. 40శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలూ మినహాయింపు ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని