సాయం కోరితే కోరిక తీర్చమన్నారు.. వైకాపా నేతల వేధింపులపై మహిళ ఆవేదన

కరోనాతో భర్త చనిపోయి కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే తమ కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 Jan 2024 07:21 IST

కనగానపల్లి, న్యూస్‌టుడే: కరోనాతో భర్త చనిపోయి కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే తమ కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అండగా ఉంటానని చెప్పిన రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కన్నెత్తి చూడలేదని ఆమె వాపోయారు. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన వైకాపా సానుభూతిపరురాలు తన ఆవేదనను పరిటాల సునీతతో చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాటల్లోనే.. నా భర్త రెండేళ్ల కిందట కరోనాతో చనిపోయారు. స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్ని విధాలా అండగా ఉంటానని.. ఏ కష్టమొచ్చినా చెప్పాలని హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఒక్క రూపాయి సాయం అందలేదు. సంక్షేమ పథకాల కోసం వైకాపా నాయకులు అడిగిన కాగితాలు ఇచ్చా.. అయినా ఏ పథకం రాలేదు. ఆఖరికి ఇంటి బిల్లు కూడా ఇవ్వలేదు. కార్యాలయాలు, వైకాపా నాయకుల చుట్టూ తిరగడానికి రూ.5 వేల వరకు ఖర్చు పెట్టుకున్నా. సాయం చేయాలంటే తమ కోరిక తీర్చాలంటూ కొందరు స్థానిక వైకాపా నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోలేదు. నాకు ప్రభుత్వం నుంచి పింఛను తప్ప మరే పథకం అందడం లేదు. తనను, తన పిల్లల్ని రక్షించాలని ఆమె పరిటాల సునీతను వేడుకున్నారు. ఇందుకు చలించిపోయిన సునీత అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వైకాపా పాలనలో సొంత పార్టీ సానుభూతిపరురాలైన బీసీ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని సునీత ప్రశ్నించారు. వైకాపాలో బీసీలకు గౌరవం లేదని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని