Hyderabad: జీహెచ్‌ఎంసీ అధికారులపై మండిపడ్డ మేయర్‌.. కార్పొరేటర్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా సాగింది.

Updated : 19 Feb 2024 15:47 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా సాగుతోంది. అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డివిజన్లలోని సమస్యలను మేయర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయాల్లో కూర్చొని సంతకాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని భాజపా, ఎంఐఎం కార్పొరేటర్లు అధికారులకు హితవు పలికారు. వారికి కాంగ్రెస్, భారాస సభ్యులు కూడా మద్దతు ప్రకటిస్తూ అధికారుల పనితీరును ప్రశ్నించారు. వీధి దీపాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

మరోవైపు మేయర్‌ కూడా అధికారులపై మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండా జోనల్ స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్పొరేటర్ శ్రావణ్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రోనాల్డ్ రాస్.. 312 మంది అధికారులు డిప్యూటేషన్‌పై ఉన్నారని, 45 మంది రిటైర్డ్ అధికారులున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ జీహెచ్‌ఎంసీ పాలకమండలి తీర్మానం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని