Telangana: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు వచ్చేలా లోగోను రూపొందించారు.

Updated : 22 May 2023 20:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు తదితరులు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో లోగోను రూపొందించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, టీహబ్‌, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ తదితరాలకు లోగోలో ప్రాధాన్యత కల్పించారు.

తెలంగా దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి హృదయం ఉప్పొంగేలా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్‌ డేగా జరుపుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్తూపాలను పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించాలని చెప్పారు. పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి, సినిమా-జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని