GHMC: నీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేయాలి: జలమండలి ఎండీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు.

Published : 21 Jul 2023 18:55 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చేస్తున్న నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, ఇతర అధికారులతో ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో దానకిశోర్‌ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

‘‘ముంపు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు, సీవర్ జెట్టింగ్ యంత్రాల ఆపరేషన్లను ఆయా డీజీఎంలు తనిఖీ చేయాలి. సంబంధిత సీజీఎంలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి. వర్షం కారణంగా రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్ల వద్ద సీవరేజ్‌ ఓవర్ ఫ్లోపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి. లోతైన మ్యాన్‌హోళ్లు, మురుగు ఉప్పొంగే ప్రాంతాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు పని ప్రదేశాల్లో తప్పనిసరిగా హెల్మెట్లు, గ్లౌజులు, గమ్ బూట్స్ ధరించడంతో పాటు ఇతర రక్షణ చర్యలు పాటించేలా చూడాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలను పంపిణీ చేయాలి. వీటిని క్వాలిటీ అనాలసిస్ వింగ్ జనరల్ మేనేజర్, ఇతర అధికారుల సమన్వయంతో పంపిణీ చేయాలి. పోలీసు అధికారులతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలి’’ అని జలమండలి ఎండీ దానకిశోర్‌ అధికారులకు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని