Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు

కుమారుడు పదో తరగతిలో ఉండగా.. అతడిని ఎంకరేజ్‌ చేసేందుకు ఆ తల్లీ చదివింది. క్రమంగా చదువుపై మరింత మక్కువ పెంచుకున్న ఆమె.. పోటీ పరీక్షలకు సిద్ధమై ఏకంగా ప్రభుత్వ కొలువు సాధించింది.....

Published : 09 Aug 2022 01:52 IST

తిరువనంతపురం: కుమారుడు పదో తరగతిలో ఉండగా.. అతడిని ప్రోత్సహించేందుకు ఆ తల్లీ చదివింది. క్రమంగా చదువుపై మరింత మక్కువ పెంచుకున్న ఆమె.. పోటీ పరీక్షలకు సిద్ధమై ఏకంగా ప్రభుత్వ కొలువు సాధించింది. కుమారుడు సైతం జాబ్‌ సాధించడంతో ఆ ఇరువురు ఒకేసారి ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. చదువులో కుమారుడిని తల్లి ప్రోత్యహిస్తే.. కొలువు సాధించడంతో తల్లికి కుమారుడి ప్రోత్సాహం దక్కింది. విఫలమైనా.. ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధిస్తామని ఆ తల్లి ధీమాగా చెబుతోంది.

కేరళలోని మలప్పురానికి చెందిన బిందు బేగన్‌ (42) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు పదో తరగతిలో ఉండగా.. అతడిని ఉత్తేజపరిచేందుకు ఆమె కూడా పుస్తకాలు చదవడం ప్రారంభించారు. మొదట కథల పుస్తకాలతో మొదలైన ఆమె ప్రస్థానం.. చదువుపై మక్కువ పెరగడంతో పోటీ పరీక్షలవైపు వైపు మళ్లింది. కుమారుడి పదో తరగతి పరీక్షల తర్వాత ఆమె కోచింగ్‌ సెంటర్‌లో చేరి కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమయ్యారు.

మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా.. నాలుగోసారి ఆమె విజయవంతమయ్యారు. తాజాగా లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్‌ (LGS) కొలువు సాధించారు. ఇందుకు ఆమె తొమ్మిదేళ్లు కృషి చేయడం విశేషం. డిగ్రీ పూర్తి చేసిన ఆమె 24 ఏళ్ల కుమారుడు సైతం లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌ (LDC) పరీక్షలో పాసయ్యాడు. త్వరలోనే వారు ఆయా ఉద్యోగాల్లో కొలువుదీరనున్నారు. బిందు బేగన్‌ గురించి కోచింగ్‌ సెంటర్‌ ప్రతినిధులు, సెంటర్‌లోని ఆమె మిత్రులు మాట్లాడుతూ ఆమె తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. కుమారుడు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాడని తెలిపారు.

తల్లి గురించి కుమారుడు మాట్లాడుతూ అంగన్‌వాడీ విధులు, ఇంట్లో పనుల వల్ల ఆమెకు చదవడం నిత్యం వీలుండేది కాదని.. కాస్త దొరికిన సమయంలోనే ప్రిపేర్‌ అవుతూ ఉండేదని పేర్కొన్నాడు. తాను మొదట పోలీసు పరీక్ష రాశానని, కొద్దిపాటి మార్కులతో అది మిస్సయ్యిందన్నాడు. ఆపై ఎల్‌డీసీ పరీక్షపై దృష్టిసారించి విజయవంతమయ్యానని తెలిపాడు. బిందు బేగన్‌ మాట్లాడుతూ ‘ఖాళీ సమకం దొరక్క అప్పుడప్పుడు మాత్రమే చదువుతుండేదాన్ని. తొమ్మిదేళ్లలో నాలుగుసార్లు ప్రయత్నించా. పరీక్షకు ఆరు నెలల ముందునుంచి ప్రిపేర్‌ అయ్యేదాన్ని. కానీ ఏనాడు వెనకడుగు వేయలేదు’ అని పేర్కొన్నారు. పట్టుదల చివరికి ఎలా ఫలితాన్ని ఇస్తుందో చెప్పడానికి తానే ఓ ఉదాహరణ అని అన్నారు. అపజయాలు ఎదురైనప్పటికీ ప్రయత్నిస్తూఉంటే చివరికి విజయం సాధిస్తామని గర్వంగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని