Andhra News: ఉపాధ్యాయ సంఘాలే సమ్మె కొనసాగించాల్సింది: పీఆర్సీ సాధన సమితి నేతలు

ప్రభుత్వంతో తమ చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే ఉపాధ్యాయ సంఘాలే సమ్మె కొనసాగించాల్సిందని పీఆర్సీ సాధనసమితి నేతలు వ్యాఖ్యానించారు. చర్చల్లో తమతోపాటు

Updated : 10 Feb 2022 04:23 IST

అమరావతి: ప్రభుత్వంతో తమ చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే ఉపాధ్యాయ సంఘాలే సమ్మె కొనసాగించాల్సిందని పీఆర్సీ సాధనసమితి నేతలు వ్యాఖ్యానించారు. చర్చల్లో తమతోపాటు ఉన్నవారే భిన్నంగా మాట్లాడుతున్నారని వివరించారు. చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే అప్పుడే లేవనెత్తాల్సిందని పేర్కొన్నారు. వారి మాటల వెనుక కొన్ని శక్తులు దాగి ఉండొచ్చని ఆరోపించారు. ఉపాధ్యాయుల ముసుగులో రాజకీయశ్రేణులు దాడి చేస్తాయని సమాచారం ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సమ్మె జరగలేదనే ప్రస్టేషన్‌తోనే దుష్ప్రచారం..

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చర్చల సమయంలో మాతో ఉండి.. మమ్మల్ని మాట్లాడనీయలేదంటున్నారు. ఫిట్‌మెంట్‌ నచ్చలేదని చెబుతున్నారు. ఫిట్‌మెంట్‌పై మొదటిగా చర్చ జరిగింది. ఫిట్‌మెంట్‌పై మంత్రులు స్పష్టంగా చెప్పినప్పుడు నచ్చలేదని ముందే బయటకు వచ్చేయాల్సింది. ఫిట్‌మెంట్‌ తప్ప అన్నీ సాధించుకోగలిగామన్నారు. సమ్మె విరమించేందుకు అంగీకరించారు. చర్చల తర్వాత మీడియా సమావేశంలో కూడా కూర్చున్నారు. తర్వాత ఫోన్లు రావడంతో వారు వెళ్లిపోయారు. ఫిట్‌మెంట్‌ సాధించలేకపోయామన్న అసంతృప్తి మాకూ ఉంది.. కానీ, మిగతా వాటితో పోల్చితే అది చిన్న అంశమే. సమ్మె చేయాలనే ఉత్సాహం కొందరిలో ఉంది. సమ్మె జరగలేదనే ఫ్రస్టేషన్‌తో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

పోలీసుల రక్షణ మాకొద్దు.. ఉద్యోగులే కాపాడుకుంటారు

‘‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.... ప్రస్తుతం ఉద్యోగులను సంతృప్తి పరిచే ఫిట్‌మెంట్‌ ఇవ్వలేని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన అశక్తతను ప్రభుత్వం వ్యక్తం చేసిన సందర్భంలో వచ్చే ఏడాదే వేతన సవరణ సంఘాన్ని నియమించాల్సిన పరిస్థితిని కల్పించాం. 2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఐఆర్‌ ప్రకటించడమో, అధికారం కాంక్షించే పార్టీలు మేమొచ్చి ఇస్తామని చెప్పాల్సిన రాజకీయ అనివార్యత వచ్చేలాంటి పరిస్థితిని కల్పించడం ద్వారా ఉద్యోగులకు త్వరలోనే ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి తీసుకొచ్చాం. మా నిర్ణయంతో విభేదిస్తున్నామంటే ఉపాధ్యాయ సంఘాలు మీ కార్యాచరణ మీరు తీసుకోండి మాకు అభ్యంతరంలేదు. ఫిట్‌మెంట్‌ విషయంలో మేం కూడా ఆనందం వ్యక్తం చేయడంలేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మేలు చేకూర్చే అంశం కంటే వీరి వ్యాఖ్యల వెనుకు మరేదో ఉందనే అనుమానం కలుగుతోంది. ఇందులో రాజకీయ ప్రమేయం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నాం. మా నిర్ణయం ఉపాధ్యాయులకు నచ్చకపోతే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి వారే సమ్మెను కొనసాగించొచ్చు కదా. ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులతో రక్షణ కల్పించారు. పోలీసు రక్షణ మాకొద్దు.. ఉద్యోగులే మమ్మల్ని కాపాడుకుంటారు. దాడులకు కుట్ర చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని