ఏపీలో ఇసుక రీచ్‌లపై పిటిషన్‌ వేశాడని కక్షసాధింపు.. అజ్ఞాతంలోకి నాగేంద్ర

రాష్ట్రంలోని అన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన దండా నాగేంద్రపై ప్రభుత్వ శాఖల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

Updated : 04 Aug 2023 22:29 IST

అమరావతి: రాష్ట్రంలోని అన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన దండా నాగేంద్రపై ప్రభుత్వ శాఖల నుంచి వేధింపులు మొదలయ్యాయి. నాగేంద్రకు పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పల్నాడు జిల్లా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు.. అతిథి గృహానికి నోటీసులు అంటించారు. గెస్ట్‌ హౌస్‌ అనుమతి లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వకపోతే అక్రమ కట్టడంగా భావించి కూల్చివేస్తామని తెలిపారు.

తాజా పర్యావరణ అనుమతులు లేకుండా.. ఇసుక తవ్వొద్దు

పోలీసు కేసులకు భయపడి దండా నాగేంద్ర ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా అమరావతికి చెందిన నాగేంద్ర ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషన్‌ వేశారు. అందుకు కంచేటి సాయి సహకరించాడు. వీరిద్దరూ గతంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు అనుచరులుగా ఉండే వారు. ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో వారిని వైకాపా నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత నాగేంద్ర ఎన్జీటీలో పిటిషన్‌ వేశారు.

కృష్ణానది గర్భంలో కిలోమీటర్ల పొడవున రహదారులు చేసి పర్యావరణ చట్టానికి తూట్లు పొడుస్తూ, భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని ఆధారాలు అందజేశారు. ఆ మేరకు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపాలని ఎన్టీటీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచే వీరిద్దరిపై పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. కంచేటి సాయిని అక్రమ మద్యం తరలిస్తున్నారని అరెస్టు చేసి జైలుకు పంపారు. అతను బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కంచేటి సాయిపై పీడీ చట్టం ప్రయోగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో పీడీ యాక్ట్ ప్రయోగించి పొరుగు రాష్ట్రంలో ఉన్న సాయిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో దండా నాగేంద్ర అప్రమత్తమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని