ఏ రాష్ట్రంలోనూ టీకా కొరత లేదు: కేంద్రం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కొవిడ్‌ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.

Updated : 29 Feb 2024 14:00 IST

దిల్లీ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కొవిడ్‌ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. రాజస్థాన్‌లో టీకాల కొరత ఉందంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న టీకా నిల్వలపై ప్రతిరోజూ సమీక్ష చేస్తామని, ఇప్పటివరకు అలాంటి కొరత ఏర్పడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తెలిపారు. ‘వ్యాక్సిన్‌ వినియోగం, నిల్వపై ప్రతి రోజూ అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం వస్తుంది. వీటిపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో పర్యవేక్షిస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌లను నేరుగా పంపిణీ చేయదు. కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కేంద్రాలకు ఉచితంగా అందజేస్తాం. ప్రైవేటులో మాత్రం ధరల నియంత్రణను పర్యవేక్షించే బాధ్యత మాది’ అని ఆయన వివరించారు. 

ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నామని.. రాజస్థాన్‌లోనూ ఇప్పటివరకు కొరత రాలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర తగ్గుతుందా అని అడిగిన ప్రశ్నకు.. వీటిపై ఇప్పటికే ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపామని రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఒక డోసు టీకా ధరను రూ.200ల కంటే తక్కువకు వచ్చేలా సంప్రదింపులు జరిపామన్నారు. ఇదిలాఉంటే, కొవిషీల్డ్‌ తయారుచేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో మరో పది కోట్ల డోసుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. డోసుకు రూ.150ల చొప్పున (జీఎస్‌టీ కలుపుకొని) ఈ పది కోట్ల డోసులను అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే రాజ్యసభలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని