Hyderabad: జాకీలతో లేపే క్రమంలో ఒరిగిన భవనం.. కూల్చివేస్తున్న అధికారులు

జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలన్న ప్రయత్నం బెడిసి కొట్టి భవనం.. మరో ఇంటిపై ఒరిగిన ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు.

Updated : 25 Jun 2023 21:40 IST

హైదరాబాద్‌:  జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలన్న ప్రయత్నం బెడిసి కొట్టి భవనం.. మరో ఇంటిపై ఒరిగిన ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా రెండు భవనాలను కూల్చివేస్తామని ప్రకటించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తొలుత పక్కకు ఒరిగిన పురాతన భవనాన్ని జేసీబీతో కూల్చివేత పనులు చేపట్టారు. ఇళ్లలో ఉన్న గృహావసరాలు, మిగతా సామగ్రిని డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితగా బయటకు తెచ్చారు. కూల్చివేత పనులు జరుగుతున్న భవనం వద్దకు ఎవరూ రాకుండా డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. 

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన నర్సింహారావు.. 25 ఏళ్ల క్రితం జీ ప్లస్‌ 2 విధానంలో ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం అక్కడ రోడ్డు ఎత్తు పెరగడంతో.. వర్షం కురిసిన ప్రతిసారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. తెలిసిన వారి సూచనలతో ఇంటి ఎత్తును పెంచేందుకు చర్యలు చేపట్టాడు. పనులను విజయవాడకు చెందిన ఓ గుత్తేదారుకు అప్పగించాడు. భవనంలో మొత్తం యజమాని సహా ఆరు కుటుంబాలు ఉంటున్నాయి. మరమ్మతుల ప్రక్రియ మొదలైన తర్వాత రెండు కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లగా.. మరో రెండు కుటుంబాలు సమీపంలోని తెలిసిన వారి ఇళ్లకు మారారు. యజమాని కుటుంబంతోపాటు మరో కుటుంబీకులు అందులోనే ఉంటున్నాయి. ఇంటిని ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్‌ జాకీలు శనివారం రాత్రి అదుపుతప్పడంతో.. ఒక్కసారిగా ఆ భవనం పక్కనున్న మరో భవనంపైకి ఒరిగిపోయింది. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి వర్షం కురవడంతో కూల్చివేత పనులను ఆదివారానికి వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని