Balineni: తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ

ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసు విషయంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు.  

Updated : 17 Oct 2023 12:51 IST

ప్రకాశం: ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని ఆగ్రహంగా ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి బాలినేని లేఖ రాశారు. ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తక్షణం తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు చెప్పారు. 

జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మంది అరెస్టు అయ్యారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దన్నారు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని బాలినేని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని