వైకాపా ‘సిద్ధం’ సభ ఎఫెక్ట్‌.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

రాష్ట్రంలో సీఎం జగన్‌ సభ ఎక్కడ జరిగినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నేడు వైకాపా ఆధ్వర్యంలో ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్నారు.

Updated : 10 Mar 2024 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్రంలో సీఎం జగన్‌ సభ ఎక్కడ జరిగినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నేడు వైకాపా ఆధ్వర్యంలో ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 ఆర్టీసీ బస్సులను ఆ సంస్థ కేటాయించింది. వైకాపా కార్యకర్తల తరలింపునకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచీ బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బాపట్ల, చీరాల, మార్కాపురం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంపై ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో సభ జరిగితే తమకు ఇబ్బందులేంటని నిలదీస్తున్నారు. 

నెల్లూరు జిల్లా నుంచి 332, పల్నాడు నుంచి 300, గుంటూరు నుంచి 225 బస్సులను ‘సిద్ధం’ సభకు తరలించారు. చీరాల డిపోలో మొత్తం 96 బస్సులు ఉండగా వాటిలో 80 వరకు సభకు కేటాయించారు. దీంతో చీరాల నుంచి గుంటూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం నుంచి 70 బస్సులు వెళ్లాయి. మరోవైపు సభకు వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. ఒంగోలు వైపు వెళ్లకుండా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఆపేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని