Telangana News: వేటకు వెళ్లి గుహలో చిక్కుకున్న వ్యక్తి.. 24 గంటలుగా నరకయాతన

వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు రామారెడ్డికి చెందిన వ్యక్తి. పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 15 Dec 2022 02:16 IST

రామారెడ్డి: వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు(38) మంగళవారం సాయంత్రం ఘన్‌పూర్‌ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయాడు.

ఆ సమయంలో అతడితో పాటు మహేశ్‌ అనే మిత్రుడు కూడా ఉన్నాడు. మంగళవారం ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. బుధవారం కూడా కొందరు గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని జేసీబీలు, కంప్రెషర్లు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని