
పక్కా కాంగ్రెస్ వాది..అయినా ఆరెస్సెస్ సమావేశానికి!
ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిది దశాబ్దాలు దాటిన వయసు, ఆరు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఆయన సొంతం. రెండు వైరుధ్య సిద్ధాంతాల మధ్య పోరులో రాజనీతి చూపిన అపర చాణక్యుడు ఆయన. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది అయినప్పటికీ ఆరెస్సెస్‌తో అనుబంధం ఆయనకే చెల్లింది. ఆయనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ.
ఆయన మాటలకు రాజకీయ విశ్లేషకులు ఫిదా
2018 జూన్7న నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరవడం అప్పట్లో పెను సంచలనం. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, వ్యూహ చతురుడిగా పేరున్న ప్రణబ్ ముఖర్జీ ఆనాడు ఆ కార్యక్రమంలో మాట్లాడిన తీరు రాజకీయ విశ్లేషకులనే తలలు పట్టుకునేలా చేసింది. పార్టీలకతీతంగా ప్రణబ్‌కు ప్రత్యేకస్థానం ఉందని ఆ సమావేశం రుజువు చేసింది. ఆ సమావేశంలో తనదైన శైలిలో ఆరెస్సెస్ ప్రబోధిస్తున్న హిందూ జాతీయవాదానికి భిన్నమైన బహుళత్వ జాతీయవాదాన్ని ప్రణబ్ నొక్కిచెప్పారు.
సహనం, బహుళత్వం భారతీయుల శక్తి
ఆధునిక భారతదేశం జాతి, మతం పేరుమీద నిర్మాణం కాలేదని, బహుళత్వ ప్రాతిపదికన పలువురు మహనీయుల ఆలోచనల నుంచి రూపొందిందని ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతం, ఒక మతం, గుర్తింపు, ద్వేషం, అసహనం అనే భావనల ఆధారంగా జాతీయతను నిర్వచిస్తే అది భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ గుర్తింపును నాశనం చేస్తుందన్నారు. సహనం బహుళత్వం అనేవి భారతీయుల శక్తి అని, భారత జాతీయవాదం అనేది రాజ్యాంగబద్ధ జాతీయవాదంగా ఉండాలన్నారు.
సొంత పార్టీలో వారించినా..
లౌకికవాదులు, సొంత పార్టీవారు వారించినా ఆరెస్సెస్ శిక్ష వర్గ్ సమావేశానికి హాజరయ్యారు ప్రణబ్. ఆ సంస్థ మౌలిక భావజాలంపై పరోక్షంగా లోతైన విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. ఆ సమావేశానికి ప్రణబ్ హాజరవడంపై భాజపా దిగ్గజ నేత ఎల్‌కే అడ్వాణీ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ ఆదరించే గుణమే ప్రణబ్‌ను గొప్ప నేతగా తీర్చిదిద్దిందని, ఆయన అనుభవం చాలా గొప్పదని ప్రణబ్‌ను అడ్వాణీ కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న రావడం వెనుక రాజకీయ లబ్ధితో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలు కారణమని అప్పట్లో విశ్లేషకులు భావించారు. కాంగ్రెస్ వివాద పరిష్కర్తకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం అప్పటి ఎన్డీయే సర్కారుకు మంచి పేరునే తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, మోదీ సర్కారు భారతరత్నతో గౌరవించిందని అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ప్రచారం సాగింది.