PM Modi: హైదరాబాద్‌కు ఈనెల 19న ప్రధాని మోదీ రాక.. వందే భారత్‌ రైలు ప్రారంభం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఈనెల 19న వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కొన్ని రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

Updated : 07 Jan 2023 21:28 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 19న హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందే భారత్‌ రైలు సికింద్రాబాద్- విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. దీంతో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. 

కాజీపేటలో నిర్మించ తలపెట్టిన పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ పనులను రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కొద్ది రోజుల క్రితమే ఖరారు చేసింది. ఆ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశముంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధానిమోదీ చేతులమీదుగా ప్రారంభించేలా రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. వందే భారత్ రైలుతో పాటు ఈ 3 పనులకు కూడా రైల్వే శాఖ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వీటి ప్రారంభం తర్వాత మోదీ బహిరంగసభ కూడా ఉంటుందని భాజపా నేతలు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు