Vizag: అద్దె బైకులో విశాఖపట్నం చుట్టేద్దామా... 

వాణిజ్యం, పర్యాటకపరంగా విశాఖపట్నం ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరం. సాంస్కృతిక, చారిత్రక నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. కుటుంబసమేతంగా సెలవులు గడిపేందుకు సరైన పర్యాటక ప్రదేశమిది.

Updated : 22 Nov 2021 16:41 IST

విశాఖపట్నం: వాణిజ్యం, పర్యాటకపరంగా విశాఖపట్నం ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరం. సాంస్కృతిక, చారిత్రక నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. కుటుంబసమేతంగా సెలవులు గడిపేందుకు సరైన పర్యాటక ప్రదేశమిది. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులకు రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. నగర సందర్శనకు వచ్చేవారి కోసం అద్దెకు ద్విచక్ర వాహనాలు, కార్ల సదుపాయం కల్పించింది. 

ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు ఇప్పటికే పలు సదుపాయాలను కల్పించారు. అయితే స్టేషన్‌కు చేరుకున్న యాత్రికులు.. నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాలను ఆశ్రయించే విధానాన్ని పరిశీలించిన అధికారులు.. తామే అద్దెకు వాహన సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కార్యాచరణ అమలు చేశారు. విశాఖ అందాలను తిలకించేందుకు విజయవాడ, హైదరాబాద్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని రామకృష్ణ, రుషికొండ, యారాడ బీచ్‌లు, కైలాసగిరి, టీయూ-142 ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం, సబ్‌మెరైన్‌ మ్యూజియం, జూపార్క్‌ సహా సింహాచలం, తొట్లకుండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తారు.

ఆంధ్రా ఊటీ అరకుతో పాటు లంబసింగి వంజంగి లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పర్యాటకుల అవసరాలను గ్రహించిన రైల్వే శాఖ ‘మిస్టర్‌ బైక్స్’ పేరిట బైక్‌, కార్ సర్వీసులను ఏర్పాటు చేసింది. విశాఖ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద ఎలక్ట్రికల్‌ పెట్రోలు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాటి రకం మేరకు ధరలు నిర్ణయించారు. పెట్రోల్‌తో నడిచే స్కూటీ తరహా వాహనానికి రోజుకు రూ.500, బైక్‌లకు రూ.600-1200 అద్దె  చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ సమర్పించి అద్దెకు వాహనాన్ని పొందవచ్చు. నచ్చిన వాహనం కోసం వారం రోజుల ముందు  ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది.

యువతకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటకుల కోసం రెండు వందలకుపైగా ద్విచక్ర వాహనాలు, పదుల సంఖ్యలో కార్లు అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు ఇచ్చే వాహనాలకు.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఈ సదుపాయం ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని