సెలవే లేని సేవకా..!

దేశ రక్షణ దళాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారు... సాధారణంగా మరో ఉపాధి వెతుక్కోవటమో... ప్రభుత్వ సంస్థల్లో చేరటమో చేస్తుంటారు. లేదా సొంత గ్రామంలోనే గడుపుతుంటారు. కానీ..

Updated : 31 Oct 2023 16:10 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : దేశ రక్షణ దళాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారు... సాధారణంగా మరో ఉపాధి వెతుక్కోవటమో... ప్రభుత్వ సంస్థల్లో చేరటమో చేస్తుంటారు. లేదా సొంత గ్రామంలోనే గడుపుతుంటారు. కానీ.. విజయనగరం జిల్లాకు చెందిన ఆ విశ్రాంత ఆర్మీ జవాన్లు మాత్రం.. మరికొందరు దేశసేవకులను తయారుచేస్తున్నారు. సైన్యంలో చేరాలనుకునే పేద యువకులకు స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తున్నారు. దేహదారుఢ్యంతో పాటు రాతపరీక్షకు సంబంధించిన కఠోర తర్ఫీదు ఇచ్చి మెరికల్లా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే రమణ, శంకరరావు.

సాధారణంగా..గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలని అమితాసక్తి చూపుతుంటారు. అందుకోసం పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా క్యూ కడుతుంటారు. అయితే చాలామంది రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, దేహదారుఢ్య సంబంధ పరీక్షను దాటలేక ఇబ్బంది పడుతుంటారు. దాంతో దేశానికి సేవ చేయాలన్న తమ కోరికను తీర్చుకోలేకపోతుంటారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన అలాంటి యువతకు రమణ, శంకరరావులు తర్ఫీదు ఇస్తున్నారు. ఆర్మీ జవాన్లుగా ఉద్యోగ విరమణ చేసిన వీరు యువతను దేశ సేవ కోసం ప్రోత్సహిస్తున్నారు.

నెల్లిమర్ల మండలానికి చెందిన రమణ, సీతారాముని పేటకు చెందిన శంకరరావులు పేద కుటుంబాలలో పుట్టి ఆర్మీలో చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. జవాన్లుగా 17 ఏళ్లు దేశసేవ చేశారు. కొన్ని నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆర్మీలో చేరటంలో ఇప్పటి యువతకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో..త్రివిధ దళాలు నిర్వహించే పోటీపరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నారు. శంకరరావు 70 మందికి తర్ఫీదు ఇస్తుండగా.. రమణ 50 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా వేకువ జామునే అయిదు కిలోమీటర్ల పరుగు మొదలుకొని, పుష్‌అప్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌ వంటి వ్యాయామాలు చేయిస్తున్నారు. అంతేకాకుండా వారానికోసారి పదిహేను కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. వీరిద్దరూ అందిస్తున్న శిక్షణపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా శిక్షణ అందిస్తున్న వీరికి ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగులు, దాతలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని