Hyderabad: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. భాజపా కీలక నేతకు సిట్‌ నోటీసులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Published : 19 Nov 2022 02:18 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని తెలిపారు.

ఈ  వ్యవహరంలో నిన్న కరీంనగర్‌కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు.. శ్రీనివాస్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయననూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్‌ కార్యాలయంలో ఈనెల 21నే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. వీరిద్దరిని సిట్‌ అధికారులు ఒకే సమయానికి విచారించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధంలేని వారికి నోటీసులిచ్చి వేధిస్తున్నారు..

మరోవైపు సిట్‌ నోటీసులపై భాజపా హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. భాజపా తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బి.ఎల్‌. సంతోష్‌, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్‌ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొంటూ.. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని