Omicron: ఒమిక్రాన్‌ కలవరం.. కొందరు నిపుణుల కీలక సూచనలివే..!

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. డెల్టా రకం కన్నా అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ కొత్త వేరియింట్‌ కేసులు ఇప్పటికే మన దేశంలో 215 నమోదయ్యాయి......

Updated : 23 Dec 2021 04:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. డెల్టా రకం కన్నా అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగిన ఈ కొత్త వేరియంట్‌ కేసులు ఇప్పటికే మన దేశంలో 215 నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ పెరగడంతో ఈ మహమ్మారి ముప్పు నుంచి ఎలా బయటపడాలి? దేశంలో థర్డ్‌ వేవ్‌కు ఇదే కారణమవుతుందా? మళ్లీ లాక్‌డౌన్‌కు అవకాశం ఉంటుందా? స్కూళ్లు మళ్లీ మూతపడతాయా? బూస్టర్‌ డోసు వేసుకోవాలా? ఇలాంటి ఎన్నో సందేహాలు జనం మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌ని కట్టడి చేసేందుకు, ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు, పేద ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేలా పలువురు ప్రముఖులు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు తమ అభిప్రాయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఒమిక్రాన్‌ కట్టడికి రెండు కీలక సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ టీకా పొందడం ఒకటైతే.. కొవిడ్‌ నిబంధనల్ని తూ.చ.తప్పకుండా పాటించడం రెండోది.

లాక్‌డౌన్‌ విధించొద్దు..!

ప్రముఖ టెక్‌ కంపెనీ జొహో సీఈవో శ్రీధర్‌ వెంబు కూడా ట్విటర్‌ వేదికగా కేంద్రానికి రెండు సూచనలు చేశారు. ఇకపై లాక్‌డౌన్‌లు విధించొద్దన్నారు. అవి అనేక మంది జీవనోపాధిని, మరీ ముఖ్యంగా పేద ప్రజల్ని జీవితాల్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే, కొవిడ్‌ ఔషధాలను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశంలో ఔషధాల కొరతను తీవ్రంగా ఎదుర్కొన్నామని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ ఔషధాలను విరివిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. భయపడొద్దని సూచించారు.

టీకా వేయడమే మనముందున్న మార్గం

ఇదే అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఇటీవల ట్విటర్‌లో స్పందించారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కోవాలంటే ప్రజలకు టీకాలు వేయడమే మన ముందున్న మార్గం తప్ప అనవసర ఆందోళనలు, భయాలు కాదన్నారు. 
మరోవైపు, మన దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తోంది. ఒమిక్రాన్‌ కట్టడికి సమయానుకూలంగా రాత్రిపూట కర్ఫ్యూలు విధించడంతో పాటు వార్‌రూమ్‌లను మళ్లీ క్రియాశీలం చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 100శాతం వ్యాక్సినేషన్‌ దిశగా కృషిచేయాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా గురువారం ఇదే అంశంపై కీలక సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం.

స్కూళ్ల మూత అనుమానాలపై..

ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ స్కూళ్లు మళ్లీ మూత పడతాయా? అనే అనుమానం చాలా మంది తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్‌ సోకినవారు తీవ్ర వ్యాధి లక్షణాల బారిన పడిన ఉదంతాలు ఇంకా నమోదు కాకపోవడంతో అలాంటి భయాలు పెద్దగా అక్కర్లేదని వైద్యరంగ నిపుణులు చెప్పే మాట. పాజిటివిటీ రేటు పెరిగిన సందర్భాల్లో అప్పటి పరిస్థితిని బట్టి స్కూళ్ల మూతపై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కరోనా రాకముందు కూడా వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ వైరస్‌ల వల్ల పిల్లలు ఏడాదిలో రెండు మూడుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ముంబయికి చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ లాన్స్లెట్‌ పింటో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అలాగే, పిల్లలకు కొవిడ్ టీకా ఇప్పుడే ఇవ్వడం అంత అత్యవసరం కాదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఇమ్యునైజేషన్‌ సభ్యుడు నిన్న వ్యాఖ్యానించడం గమనార్హం.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని