పద్మశ్రీ పురస్కారాలు వెనక్కి ఇచ్చింది వీరే...?

కంగనా రనౌత్‌.. బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపోటిజం) మీద పోరాటం చేస్తున్న కథానాయిక. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి తర్వాత పెద్ద ఎత్తున బంధుప్రీతి అంశంపై చర్చలకు ...

Updated : 20 Jul 2020 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి అంశంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై నటి కంగనా రనౌత్‌ కొద్ది రోజులుగా పోరాటం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి సంచలన ప్రకటన చేసింది. సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించి తన ఆరోపణలను నిరూపించలేకపోతే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని తెలిపింది. దీంతో అవార్డులు వెనక్కి ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలా పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చిన వారి గురించి ఓ సారి తెలుసుకుందాం.

అరిబమ్‌ శ్యామ్‌ శర్మ, దర్శక నిర్మాత

మణిపూర్‌కు చెందిన దర్శక నిర్మాత అరిబమ్‌ శ్యామ్‌ శర్మ. 2006లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు నిరసనగా 2019లో తన అవార్డును వెనక్కి ఇచ్చేశారు. 83 ఏళ్ల సంగీత, దర్శక, నిర్మాత అయిన శ్యామ్.. తన చిత్రాలకుగాను పలుసార్లు జాతీయ అవార్డులను అందుకోవడం విశేషం. 

అసహనం పెరిగిపోతోందని..

సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు పద్మ శ్రీ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి జయంత మహాపాత్ర. ఆయనకు 2009లో పద్మశ్రీ పురస్కారం వచ్చింది. దేశంలో అసహనం పెరిగిపోతుందని జయంత తన పద్మశ్రీ పురస్కారాన్ని 2015లో వదులుకున్నారు.

ముస్తాబా హుస్సేన్, రచయిత

ప్రముఖ ఉర్దూ రచయిత అయిన ముస్తాబా హుస్సేన్ 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఉర్దూ సాహిత్యాభివృద్ధి కోసం విశేషంగా సేవలు అందించారు. తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని 2019లో నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సంతోషంగా లేనని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందని వ్యాఖ్యానించారు.

వచ్చిన కొద్ది రోజులకే వెనక్కి.. 

ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు అయిన సధు సింగ్‌కు 1984 జనవరిలో పద్మశ్రీ పురస్కారం వరించింది. అయితే కేవలం నెలల వ్యవధిలోనే జూన్ ‌లో అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు వ్యతిరేకంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

పదకొండేళ్ల తర్వాత.. 

సాహిత్యం, విద్యకు అందించిన సేవలకు గాను 2004లో నవలా రచయిత దలిప్‌ కౌర్‌ తివానాకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. పదకొండేళ్ల తర్వాత.. 2015లో దేశంలో అసహనం పెరిగిపోతుందని నిరసన వ్యక్తం చేస్తూ అవార్డును వెనక్కి ఇచ్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని