Statue of Equality: సమతామూర్తి దివ్య క్షేత్రంలో అద్భుతాలెన్నో.. ఆ విగ్రహం విశేషాలు తెలుసా?

ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు.. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి శ్రీ రామానుజాచార్యులు.....

Updated : 05 Feb 2022 23:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు.. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి శ్రీ రామానుజాచార్యులు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడాయన. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంలో మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టమైన శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవాలు హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలివీ.. 

  • ప్రవేశద్వారం: కాకతీయుల నిర్మాణశైలితో నాలుగు తోరణాలు నిర్మించారు. అవి 30 అడుగుల ఎత్తు, 9.6 అడుగుల వెడల్పుతో ఉంటాయి.

  • గరుడ, హనుమ మండపాలు: 45 అడుగుల ఎత్తులో మండపాలు ఉంటాయి. ఒకవైపు గరుడ, మరోవైపు హనుమ విగ్రహాలు 18 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాయి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలలో కైలాష్, ఎల్లోరా గుహల శైలిలో నిర్మాణాలు చేశారు. తమిళనాడు రాష్ట్రం దారాసరంలోని ప్రాచీన చోళ, పల్లవ కాలం నాటి శైలిలో ప్రవేశద్వారంలోని గోపురాలు నిర్మించారు. ఇందుకు 2 లక్షల చదరపు అడుగుల రాయిని వాడారు.


 

  • జల తరంగిణి : 108 అడుగుల వృత్తాకార చుట్టుకొలత.. 36 అడుగుల ఎత్తుతో అష్టాదశ పద్మాకృతిలో జలతరంగిణి (ఫౌంటెన్‌) ఉంటుంది. ఫౌంటెన్‌పైన ఉన్న తామర పువ్వులో రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది. ఫౌంటెన్‌ చుట్టూ ఉన్న ఎనిమిది పువ్వులు.. ఎనిమిది జీవరాశుల నుంచి నీళ్లు వెదజల్లి రామానుజాచార్యకు అభిషేకం చేస్తాయి. ఫౌంటెన్‌ గొట్టం పైన సింహాలు(తామసానికి ప్రతీక), ఏనుగులు(రాజసం), హంస(సత్యగుణం)లను తీర్చిదిద్దారు. వీటన్నింటిపై ఆచార్యదేవులు కొలువుదీరి ఉంటారు. ఫౌంటెన్‌ను ఒక్కసారి నీటితో నింపాలంటే లక్ష లీటర్లు  అవసరం.

​​​​​​​

  • 108 దివ్యదేశాల నిర్మాణం: దేశవ్యాప్తంగా వేర్వేరు కాలాల్లో నిర్మితమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అనంతపద్మనాభస్వామి, శ్రీరంగం, అయోధ్య, ద్వారక, ముక్తినాథ్, బద్రినాథ్, ద్వారక, నైమిశారణ్యం వంటి 108 ఆలయాలను(వీటినే దివ్యదేశాలు అంటారు) ఇక్కడ అదే నిర్మాణశైలిలో కొలువుదీర్చారు. వీటి నిర్మాణానికి సుమారు 14 నెలల సమయం పట్టింది. అందుకోసం ప్రధాన స్థపతి 92 ఆలయాలను సందర్శించి, వాటి చిత్రాలు సేకరించారు.
  • సెల్ప్‌గైడెడ్‌ టూల్‌: ఎన్‌ఎఫ్‌సీ సాంకేతికతతో సెల్ఫ్‌గైడెడ్‌ టూల్‌ అందుబాటులోకి రానుంది. ఏ ఆలయం వద్దకు వెళితే.. వాటి విశిష్టతను 4 భాషల్లో వినే వీలుంటుంది. 
  • దివ్యమండపం: దివ్యదేశాలన్నింటికీ కలిపి దివ్య మండపం ఉంటుంది. 1,88,500 చదరపు అడుగుల విస్తీర్ణం.. 2,691 అడుగుల పొడవు, 603 అంగుళాల వెడల్పుతో నిర్మించారు. 468 స్తంభాలు 12.6 అడుగుల ఎత్తు, 2.9 అడుగుల వెడల్పుతో ఉంటాయి. రాజస్థాన్‌లోని బీస్‌వాలా నుంచి సేకరించిన నల్లని మార్బుల్‌తో వాటిని తయారుచేశారు. 75వేల ఘనపుటడుగల రాయిని వినియోగించారు. 
  • కృష్ణ పురుషశిలలతో విగ్రహాలు: దివ్యదేశాల ఆలయాలలోని దేవతామూర్తులను తిరుపతి, ఆళ్లగడ్డ, మహాబలిపురం, శ్రీరంగం నుంచి వచ్చిన శిల్పులు మలిచారు. విగ్రహాలు కృష్ణశిలలోనూ, ప్రత్యేకించి పురుషశిలను ఉపయోగించి మలిచారు. ప్రతి విగ్రహానికి ధ్వనిపరీక్ష చేసి ఎంపిక చేశారు. 
  • స్తంభాలలోనే ఆలయాలు: భద్రవేది కింది అంతస్తు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిపై ఉండే స్తంభాలు 22 అడుగుల ఎత్తు ఉంటాయి. ప్రతి స్తంభంలోనూ ప్రత్యేకంగా చిన్న ఆలయం ఉండేలా నమూనా ఉంటుంది. నిర్మాణాల్లో వినియోగించిన టేకును తూత్తుకుడి నుంచి తెచ్చారు. 
  • ఉజ్జీవన సోపాన మండపం: భద్రవేది పైనున్న సమతామూర్తి వద్దకు నేరుగా వెళ్లేలా రూపొందించిన మెట్ల మార్గం. 108 మెట్లు 6 అంగుళాల ఎత్తులో ఉంటాయి. 
  • గంట మండపం: విగ్రహానికి వెనకవైపు గంట మండపం ఉంటుంది. 1,200 కిలోల బరువుతో గంట ఉంటుంది. 

విగ్రహం విశేషాలు..

  • సమతాస్ఫూర్తి కేంద్ర ఏర్పాటు ఆలోచన 2013లో అంకురించగా, 2014 మే నెలలో బీజం పడింది. 
  • 250 కిలోమీటర్ల గాలివేగాన్ని తట్టుకునేలా త్రిదండం, మూర్తి నమూనాను రూపొందించారు.
  • నిర్మాణం భూకంపాలనూ తట్టుకుని నిలుస్తుంది. భూకంప లేఖినిపై 9 నమోదైనా చెక్కు చెదరదు.
  • భద్రవేది సహా విగ్రహం ఎత్తు : 216 అడుగులు
  • శ్రీరామానుజుల మూర్తి ఎత్తు : 108 అడుగులు
  • త్రిదండం ఎత్తే: 153 అడుగులు
  • త్రిదండంపై ఉండే జలపవిత్రం బరువు 6 టన్నులు, ఎత్తు 13 అడుగులు, వెడల్పు 18 అడుగులు

​​​​​​​

  • విజయస్తంభం: రామానుజాచార్యుల కీర్తికి చిహ్నంగా పార్కింగ్‌ ప్రదేశం సమీపంలో 50.3 అడుగుల ఎత్తుతో ఏకశిలతో విజయస్తంభం నిర్మించారు.

​​​​​​​

  • మొట్టమొదటి ధ్వజస్తంభం: ప్రపంచంలో రామానుజాచార్య ఆలయానికి తొలిసారిగా ధ్వజస్తంభం పెట్టారు. 42 అడుగుల ఎత్తులో ఉంటుంది. నవగ్రహాలు, ద్వాదశ రాశులతో కూడిన రూపాలు ఏర్పాటు చేస్తారు.
  • 3డీ ప్రొజెక్షన్‌ : ప్రవేశద్వార మండపంపై 8 ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుల మూర్తిపై లేజర్‌ కిరణాలను ప్రొజెక్టర్లతో ప్రసరింపజేస్తారు. 18 నిమిషాలపాటు లేజర్‌ షో ఉంటుంది.
  • యాళీల ఏర్పాటు: నల్ల మార్బుల్‌ రాయితో మండపం ముందు యాళీలను సృష్టించారు. 24 యాళీలు, 34 శుక యాళీలు ఉన్నాయి. సింహం ముఖం, మొసలి దంతాలు, ఏనుగు తొండం..ఇలా అన్ని జంతువుల లక్షణాలు కలగలిసిన యాళీలు ఆచార్యపురుషుడి ముందు వినయంగా ఉన్నట్టు కనిపిస్తాయి.
  • హంపి రథం పునఃసృష్టి: దేశంలోనే తొలిసారిగా హంపి రథాన్ని పూర్తిస్థాయిలో పునఃసృష్టించారు. ప్రస్తుతం అక్కడి రథం విమానగోపురం లేకుండా ఉంటుంది. అయితే 1856లో బ్రిటిష్‌వారు తీసిన ఫొటోలను పరిశీలించి, వాటి ఆధారంగా విమానగోపురంతో కూడిన రథాన్ని ఇక్కడ సిద్ధంచేశారు. రెండు వైపులా 31 అడుగుల ఎత్తులో రథాలు చేయించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని