Top Ten News @ 5 PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 14 Jul 2021 17:26 IST

1. ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే: చంద్రబాబు

కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిని సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు (కొల్లు రవీంద్ర మామ) కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెదేపా శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

2. ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: వైకాపా

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైకాపా సంఘీభావం తెలిపింది. ఇవాళ విశాఖలో కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చించారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపించి అమ్మెస్తామనడాన్ని వ్యతిరేకిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

3. ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మ వంచన: కేటీఆర్‌

భాజపా నేత ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని.. ఆత్మ వంచన అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఈటల.. తాను మోసపోతూ ప్రజలనూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటలకు తెరాస ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

Ts News: రెండో రోజు కేబినెట్‌ భేటీ ప్రారంభం

4. మూడో ముప్పువేళ.. ఈ కాంవడ్ యాత్ర ఏంటి..?

కరోనా మూడోముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ) ప్రభుత్వం కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని కోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. 

5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (డీఏ) పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు. 

6. Prashant Kishor: పీకే కాంగ్రెస్‌లో చేరనున్నారా?

దేశ రాజకీయాల్లో ప్రశాంత్‌ కిశోర్ ఇప్పుడో ఓ హాట్‌ టాపిక్‌. ఆయన ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడ ఊహాగానాలే. ఆ మధ్య ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలవడంతో భాజపాకు ప్రత్యామ్నాయ కూటమి సిద్ధం చేయడంలో పీకే కీలక పాత్ర పోషిస్తున్నారంటూ చర్చలు జరిగాయి. తాజాగా ఆయన కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ వాద్రాతో మంగళవారం భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం దిల్లీ వర్గాల్లో జరుగుతోంది.

Nandigram: నందిగ్రామ్‌ ఎన్నికపై ఈసీకి నోటీసులు

7. పాక్‌లో ఉగ్రదాడి.. చైనా ఇంజనీర్ల మృతి

వాయవ్య పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజనీర్లు, పాకిస్థాన్‌ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కొహిస్థాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

8. ఏం జరిగినా ఆత్మహత్య చేసుకోనని లేఖ రాశా..!

ఆయన పాట మౌనంగా ఉన్న మదిలో కూడా ప్రేమ పుట్టేలా చేస్తుంది. ఆమె మాట నిత్యం బుల్లితెర వేదికగా మనల్ని పలకరిస్తుంది. మాటపాటలతో ప్రారంభమైన వీరి సంగీత ప్రయాణం.. ప్రేమతో ఒక్కటైంది. వాళ్లే సెన్సేషనల్‌ సింగర్‌ విజయ్‌ ప్రకాశ్‌, ఆయన సతీమణి మహతి. తాజాగా వీళ్లిద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలివే..

9. WTC2: కొత్త పాయింట్ల విధానానికి ఆమోదం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2 సరికొత్త విధానానికి ఐసీసీ ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్‌ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై చేసుకుంటే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. ఇంగ్లాండ్‌, భారత్ ఐదు టెస్టుల సిరీసుతో రెండేళ్ల సైకిల్‌ మొదలవుతుంది.

10. Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల్లోకి ఎగబాకాయి. ఐటీ, సాంకేతిక, లోహ, పారిశ్రామిక రంగాల నుంచి సూచీలకు మద్దతు లభించింది. దీంతో చివరకు సెన్సెన్స్‌ 132 పాయింట్ల లాభంతో 52,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 15,853 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద నిలిచింది.

ఇంటి అద్దె మినహాయింపును ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని