Nara Bhuvaneswari: ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదాం: నారా భువనేశ్వరి

భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.

Updated : 20 Dec 2021 14:44 IST

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 48 మందికి ఆర్థికసాయం అందజేత

తిరుపతి: భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పంచాలని చెప్పారు. తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని నారా భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్‌ ముందుకు తీసుకెళ్తుందన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. 

ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదని.. ట్రస్ట్‌గా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని భువనేశ్వరి చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకున్న దానితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఏ మహిళనూ అవమానపరచకూడదని.. అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని