Published : 07 Dec 2021 08:59 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సిమెంటు ధరల్లో కోత

సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్‌’కు డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. 

2. తక్షణమే ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్‌లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిని తమ తమ స్థానిక కేడర్ల(పోస్టుల)లో సర్దుబాటు చేయాలని సూచించింది. 

3. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమబాట

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలి దశ ఉద్యమం నేటి నుంచి ప్రారంభం కానుంది. 2020 జనవరి 6 వరకూ కొనసాగబోయే ఈ ఉద్యమంలో భాగంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, భోజన విరామ సమయంలో ఆందోళనలు, తాలూకా, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. తొలిదశ ఆందోళనలకు దిగిరాకపోతే రెండోదశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

4. ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా బ్యాన్‌

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు పదార్థాల తయారీ, పంపిణీ, విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర  ఆహార పరిరక్షణ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని ప్రకటన జారీ చేశారు.

5. బోర్ల కింద వరి వద్దు

బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి పండిస్తే వచ్చే ఆదాయం.. చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చేలా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. 

6. రేపటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. మంగళవారం పొడి వాతావరణం ఉంటుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా నల్లవెల్లి(సంగారెడ్డి జిల్లా)లో 13 డిగ్రీలుగా నమోదైంది.

7. ప్రైవేటు లేఅవుట్లలో జగనన్న కాలనీలకు 5% స్థలం

‘కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5% స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలి. సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఈ మేరకు 2017 లేఅవుట్‌, సబ్‌-డివిజన్‌ నిబంధనలను సవరించారు. ప్రస్తుతం ప్రతి లేఅవుట్‌లో 10% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్న దానికి ఇది అదనం. 

8. భారత్‌... బాహుబలి

భారత్‌ బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు. ఉభయ దేశాల మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. భారత్‌-రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశం నిమిత్తం సోమవారం భారత్‌ విచ్చేసిన ఆయన... దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

9. సైనిక బలగాలపై హత్య కేసు

నాగాలాండ్‌ పౌరులపై కాల్పుల వ్యవహారంలో సైన్యంలోని 21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌పై నాగాలాండ్‌ పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. తిజిట్‌ పోలీసు స్టేషన్‌లో సంబంధిత సుమోటో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. హత్య, హత్యా ప్రయత్నం, కలిసికట్టుగా నేరపూరిత చర్యకు పాల్పడటం వంటి అభియోగాలు మోపారు. 

10. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునే బబుల్‌ గమ్‌!

కరోనా వైరస్‌కు ఉచ్చువేసి పట్టేసే ఒక బబుల్‌ గమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది రోగి లాలాజలంలో వైరల్‌ లోడును తగ్గిస్తుంది. తద్వారా వ్యాధి వ్యాప్తికి కళ్లెం వేస్తుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. లాలాజల గ్రంథుల్లో కరోనా వైరస్‌ తన ప్రతులను ఉత్పత్తి చేసుకుంటుంది. పూర్తి స్థాయిలో టీకా పొందిన వ్యక్తి లాలాజలంలోనూ వైరల్‌ లోడు ఎక్కువగానే ఉండొచ్చు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని