Published : 28 Jan 2022 08:58 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. ఏ సచివాలయం నుంచైనా అర్జీ

గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవల కోసం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రజలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సచివాలయాల్లో పౌర సేవలకు సంబంధించిన ‘ఏపీ సేవా పోర్టల్‌’ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ప్రారంభించారు. వాటి పనితీరుపై అధికారులతో సమీక్షించారు.

2. కొత్త మార్కెట్‌ విలువల పెంపు ఖరారు

తెలంగాణలో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్‌మెంట్‌ల ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్‌లకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్ర,శనివారాల్లో ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

3. ముగుస్తున్న గడువు.. దరఖాస్తుకు బరువు!

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు దరఖాస్తులు ఆశించిన స్థాయిలో అందలేదు. ఈ నెల 31తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు దూరంగా ఉన్నారు. కరోనా వల్ల 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల్లో జాప్యం చోటుచేసుకోవడం, ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమవడం తదితర కారణాలతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

4. ఉద్యానవనానికి టిప్పు సుల్తాన్‌ పేరుపై రగడ

ఆధునీకరించిన ఓ ఉద్యానవనానికి టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టడంపై మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టిప్పు సుల్తాన్‌.. హిందువులను హింసించారని, ఆయన పేరు ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించిన ప్రాంతాలకు పెట్టడం తగదంటూ భాజపా బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. భాజపా చరిత్రను వక్రీకరిస్తూ, ప్రజల్ని రెచ్చగొడుతోందని అధికార కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు గురువారం విరుచుకుపడ్డాయి. 

5. 14న పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం!

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఫిబ్రవరి 14న పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి52 ప్రయోగం చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అనుసంధానం చురుగ్గా జరుగుతోంది. దీని ద్వారా ఆర్‌ఐశాట్‌-1ఎ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 

6. గెజిట్‌ అమలు పురోగతి ఎంతవరకు వచ్చింది?

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆరా తీసింది. శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ గురువారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఛైర్మన్లతో ఆన్‌లైన్‌ వేదికగా సమీక్ష నిర్వహించారు. గతేడాది జులైలో కృష్ణా, గోదావరి నదులపైఉన్న పలు ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేర్చుతూ నోటిఫికేషన్‌ జారీ, దాని అమలు, పురోగతిపై పంకజ్‌కుమార్‌ వివరాలు అడిగినట్లు తెలిసింది.

7. ఎదురులేని బార్టీ

ఆష్లీ బార్టీ అదరహో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 42 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్‌ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. అంతే కాదు.. ఫైనల్లో గెలిస్తే 1978 తర్వాత ఈ టైటిల్‌ చేజిక్కించుకున్న మొదటి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా కూడా నిలుస్తుంది. తుది పోరులో బార్టీ.. అమెరికా అమ్మాయి కొలిన్స్‌ను ఢీకొంటుంది

8. కనెక్షన్లకు 30 రోజులు తప్పనిసరి: ట్రాయ్‌

ప్రీపెయిడ్‌ చందాదార్లకు తప్పనిసరిగా 30 రోజుల కాలావధి పథకాలను టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు అందుబాటులోకి తేవాలని ట్రాయ్‌ ఆదేశించింది. ప్రస్తుతం 28 రోజుల కాలావధి పథకాలను అమలు చేస్తున్నందున, ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జి చేయాల్సి వస్తోంది. ఇకపై 12 సరిపోతాయి. ప్రతి టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ కూడా కనీసం ఒక ప్లాన్‌ ఓచర్‌, ఒక స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్‌, కాంబో వోచర్‌లను 30 రోజుల కాలావధితో అందించాల్సిందేనని ట్రాయ్‌ స్పష్టం చేసింది.

9. గూగుల్‌ మ్యాప్స్‌లో పక్కా చిరునామా

భారత్‌లో తొలిసారిగా గూగుల్‌ మాప్స్‌లో సరికొత్త ఫీచరును గూగుల్‌ ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదార్లు తమ ప్రస్తుత లొకేషన్‌కు ‘ప్లస్‌ కోడ్స్‌’ చిరునామాను కనుగొనవచ్చు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఈ ఓపెన్‌ సోర్స్‌డ్‌ డిజిటల్‌ చిరునామాలు లొకేషన్లకు కచ్చిత చిరునామాను ఇవ్వగలుగుతాయి. సరైన, అధికారిక చిరునామా లేని ప్రదేశాలకు సైతం ఇవి ఈ సేవలు అందిస్తాయి.

10. భారత్‌తో చర్చలు నిర్మాణాత్మకం : చైనా

భారత్‌తో మిలటరీ స్థాయిలో తాము జరిపిన తాజా చర్చలు ‘సకారాత్మకం..నిర్మాణాత్మకం’గా సాగాయని, సరిహద్దు సమస్యల పరిష్కారానికి దిల్లీతో సన్నిహితంగా వ్యవహరిస్తామంటూ చైనా గురువారం ప్రకటించింది. పొరుగు దేశాలను తాము భయపెడుతున్నామన్న అమెరికా వ్యాఖ్యలు వాస్తవం కాదని ఖండించింది. జనవరి 12న ఇండియా, చైనాల నడుమ దళ కమాండర్ల స్థాయిలో 14వ విడత చర్చలు జరిగాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని