Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 08 Sep 2021 13:01 IST

1. ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఇవాళ ఉదయం మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. 

ఏపీ ఈఏపీసెట్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీరే

2. కార్పొరేషన్ ద్వారా రుణసేకరణ.. ఉక్కు పరిశ్రమ పిటిషన్ల విచారణ వాయిదా

కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణ అంశంపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రుణ సేకరణను అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాఖ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాదులు బసవ ప్రభుపాటిల్‌, బాలాజీ వాదనలు వినిపించారు. ఆర్‌బీఐ, కాగ్‌, మరో 5 బ్యాంకులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

3. శ్రీవారి సర్వదర్శన టికెట్ల జారీ పునఃప్రారంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే పునఃప్రారంభించింది. ఇందులో భాగంగా రోజుకు రెండు వేల టికెట్లను జారీ చేయనుంది. ప్రస్తుతం ఈ టికెట్లను చిత్తూరు జిల్లా భక్తులకే తితిదే పరిమితం చేసింది. కరోనా దృష్ట్యా ఏప్రిల్‌ 11 నుంచి ఈ టోకెన్ల జారీని నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే  ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు. 

4. ఏపీలో పోలీస్‌ ప్రతిష్ఠ దిగజారుతోంది: చంద్రబాబు

వైకాపా నేతల ఆదేశాలతో ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు మొగిలిచర్లకు చెందిన ఆరుగురు తెదేపా కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరు నుంచి 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారస్థాయికి చేరుకున్నాయన్న చంద్రబాబు.. పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. 

5. కొత్త కేసులు 37వేలు.. ఒక్క కేరళలోనే 25వేలు

దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 37,875 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 369 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. నిన్న 39,114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు కేరళలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 25వేలకు పైగా ఆ ఒక్క రాష్ట్రంలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 189 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

కొవిడ్‌ బాధిత చిన్నారుల్లో ఊపిరితిత్తులు పదిలమే!

6. డెల్టా జోరుకు ఇవే కారణాలు

భారత్‌ సహా అనేక దేశాల్లో వెలుగు చూసిన కరోనా కేసుల్లో సింహభాగాన్ని ఆక్రమించిన డెల్టా వేరియంట్‌కు నిర్దిష్టంగా ఈ జోరు ఎక్కడి నుంచి వచ్చిందన్నది శాస్త్రవేత్తలు నిర్ధరించారు. యాంటీబాడీలను ఏమార్చే సామర్థ్యం, అధిక సాంక్రమిక శక్తి కారణంగా దీని ఉద్ధృతి పెరిగినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ల్యాబ్‌లో ప్రయోగాలు నిర్వహించడంతోపాటు, టీకా పొందాక కూడా ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన వారి తీరుతెన్నులను పరిశీలించింది.

7. భాజపా ఎంపీ నివాసం వద్ద పేలుడు

పశ్చిమబెంగాల్‌లో భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కోల్‌కతాలోని ఎంపీ నివాసం ఇంటిపైకి బుదవారం ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు మూడు బాంబులు విసిరారు. ఈ ఘటనలో అర్జున్‌ సింగ్‌ ఇంటి గేటు ధ్వంసమవగా.. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

8. నమ్మకంగా చెబుతున్నా.. తాలిబన్లతో ఒప్పందం చేసుకోవడానికి చైనా యత్నం

తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని తాను నమ్మకంగా చెప్పగలనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళ్లడంపై అమెరికా ఆందోళనగా ఉందా..? అని విలేకర్లు బైడెన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ..‘‘చైనాకు నిజమైన సమస్యలు తాలిబన్లతోనే వస్తాయి. అందుకనే వారు తాలిబన్లతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తారు. పాకిస్థాన్‌, రష్యా, ఇరాన్‌లు కూడా ఇలానే చేస్తాయని నమ్ముతున్నాను’ అని సమాధానం ఇచ్చారు.

పాత తాలిబన్లలానే పనిచేస్తాం.. సమస్యలు తీరుస్తాం..!

9. Viral video: సొరంగంలో విమాన విన్యాసం.. గిన్నిస్‌ రికార్డు సొంతం..!

గాల్లో చక్కర్లు కొడుతూ విమానాలతో చేసే విన్యాసాలు మనం చాలా చూస్తూనే ఉంటాం. కానీ ఇటలీకి చెందిన ఓ సాహస పైలట్‌ మాత్రం రెండు సొరంగాల్లోంచి విమానం నడిపి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. విమాన విన్యాసకుడు డారియో కోస్టా.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో.. 2.6 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల్లో గంటకు 245.07 కిలోమీటర్ల వేగంతో విమానం నడిపి ఈ రికార్డు సాధించాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఆస్ట్రియాకు చెందిన రెడ్‌బుల్‌ కంపెనీ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ నెల 4న పోస్టు చేసింది.

 

10. T20 World Cup Sunil Gavaskar Team: శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌కు దక్కని చోటు

టీ20 ప్రపంచకప్‌కి సమయం దగ్గరపడుతోంది. ఈ మెగాటోర్నీ ఒమన్‌, యూఏఈ వేదికగా అక్టోబరు 17న ప్రారంభం కానుంది.  దీంతో చాలా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. బీసీసీఐ కూడా రెండు మూడ్రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, అంతకంటే ముందే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని