Guntur: విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 24 Jan 2024 19:42 IST

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా (TDP) ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్‌) (NRI Yashasvi) విచారణ దృష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. విచారణ పేరుతో యశస్విని వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. కనీసం భోజనం ఇచ్చేందుకూ అనుమతించడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించారు.

నాపై నాలుగు కేసులు పెట్టారు: యశస్వి

విచారణ ముగిసిన అనంతరం యశస్వి మీడియాతో మాట్లాడారు.‘‘ అధికారులు అడిగిన 32 ప్రశ్నలకు సమాధానం చెప్పా. కొన్ని వీడియోలు చూపించి వాటి గురించి అడిగారు. ఫిబ్రవరి 2న విజయవాడ ఆఫీసుకు రావాలని చెప్పారు. నాపై మొత్తం నాలుగు కేసులు పెట్టారు’’ అని తెలిపారు. తిరుపతి నుంచి వచ్చిన అధికారులు కూడా విచారించారని న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. విచారణ అనంతరం మధ్యవర్తుల సమక్షంలో సంతకాలు తీసుకున్నారని చెప్పారు.

వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు (YS Jagan) వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకు యష్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వృత్తి రీత్యా యష్‌ అమెరికాలో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 23న తల్లి ఆరోగ్యం బాగాలేదని భారత్‌కు రావడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. నాలుగు గంటల తర్వాత 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. జనవరి 11న తిరుపతిలో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా బుధవారం మరోసారి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని