Telangana: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం

Updated : 02 Feb 2022 16:35 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడంలేదనీ.. ఇందులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ దర్యాప్తు కూడా సరిగా లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆన్‌లైన్‌ విచారణలో ఈడీ జేడీ అభిషేక్‌ గోయెల్‌ కోర్టుకు తెలిపారు. అయితే, తమ వద్ద ఉన్న సమాచారం ఈడీకి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ వాదించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ అధికారులను ఆదేశించింది. అలాగే, డ్రగ్స్‌ కేసులో కాల్‌డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని సూచించింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు ఇవ్వాల్సిన  అవసరం లేదన్న హైకోర్టు.. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. వివరాలు ఇవ్వకపోతే సంప్రదించవచ్చంటూ ఈడీకి సూచించింది. డ్రగ్స్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలని సూచించిన ఉన్నత న్యాయస్థానం.. డ్రగ్స్‌ కేసులో రేవంత్‌ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని