Top 10 News @ 1PM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన 10 వార్తలు మీ కోసం..

Published : 15 May 2021 12:56 IST

1. COVID: భారత్‌లో పరిస్థితులపై WHO ఆందోళన
భారత్‌లో కరోనా ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపిన ఆయన భారత్‌లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు. కరోనా తొలి ఏడాది కంటే రెండో ఏడాది ‘చాలా దారుణం’గా ఉండనుందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ తరఫున భారత్‌కు కావాల్సిన సాయం అందజేస్తున్నామని అధనామ్‌ తెలిపారు. ఇప్పటికే వేలాది ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, మొబైల్‌ ఆసుపత్రులు, మాస్కులు సహా ఇతర వైద్య సరఫరాలను అందజేశామన్నారు.

2. Raghurama:మీకు ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నారు?

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభియోగాల‌తో న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును సీఐడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయ‌న‌ను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. రాత్రి నుంచి ఆయ‌న సీఐడీ కార్యాల‌యంలోనే ఉన్నారు. అర్ధ‌రాత్రి వ‌ర‌కు అద‌న‌పు డీజీ సునీల్‌కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల స‌మాచారం, సాంకేతిక స‌హ‌కారం ఎవ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్న‌లు వేశారు. ఈ విష‌యాల్లో ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌ని అడిగారు.

3. Covid మూలాలపై పూర్తి దర్యాప్తు జరగాలి

కొవిడ్‌-19 మూలాలను తేల్చడానికి మరింత పరిశోధన జరపాలని అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేశారు. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ ప్రమాదవశాత్తు విడుదలై ఉంటుందన్న వాదనపైనా దృష్టి సారించాలని కోరారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన ఇమ్యునాలజీ, అంటువ్యాధుల నిపుణుడు రవీంద్ర గుప్తా కూడా ఉన్నారు. పూర్తిస్థాయి డేటా లభ్యమయ్యేవరకూ ఈ వైరస్‌.. ల్యాబ్‌ నుంచి వెలువడిందన్న వాదనతోపాటు అది సహజసిద్ధంగా వచ్చి ఉంటుందన్న వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ఈ మేరకు వారు రాసిన లేఖ ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

5. భారత్‌లో కొత్త రకం..బ్రిటన్‌కు ఆటంకం!

భారత్‌లో విస్తరిస్తోన్న కరోనా కొత్త రకం.. బ్రిటన్‌కు ఇబ్బందిగా మారింది. ఆ దేశాన్ని ఆంక్షల ఛట్రం నుంచి వెలుపలికి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతరాయం కలిగిస్తోంది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘మా ప్రణాళికను వాయిదా వేసుకోవాల్సి వస్తుందని నేను అనుకోవట్లేదు. అయితే ఈ కొత్త కరోనా రకం మా పున:ప్రారంభ ప్రణాళకకు అంతరాయం కలిగించొచ్చు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు మేము ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బోరిస్ జాన్సన్ అన్నారు.

4.corona: కాస్త తగ్గిన కేసులు..మరణాలు

కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ..ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. తాజాగా 16,93,093 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,26,098 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరసగా రెండోరోజు కూడా కొత్త కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 3,890 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 2.43కోట్ల మందికి వైరస్ సోకగా..2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఊరటనిస్తున్నాయి.

6. మార్కెట్‌లోకి మ‌రోసారి సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కం

ఈ మే 17 నుండి 5 రోజుల పాటు చందా కోసం తెర‌వ‌బ‌డే సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం (సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్) ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ. 4,777గా నిర్ణ‌యించిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మే 2021 నుండి 2021 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 6 విడ‌త‌ల‌లో బాండ్ల‌ను జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్‌బీఐ ఈ బాండ్ల‌ను జారీ చేస్తుంది. చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌నిదినాల‌లో 999 స్వ‌చ్ఛ‌త యొక్క బంగారం స‌గ‌టు ధ‌ర ఆధారంగా బాండ్ యొక్క విలువ ఒక గ్రాము బంగారానికి రూ. 4,777గా ఆర్‌బీఐ నిర్ణ‌యించింది.

7. Black fungus: ఆ నీటి వాడకంతో వ్యాప్తి!

ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్‌ (తేమ అందించే పరికరం) ద్వారా అందించడం కూడా బ్లాక్‌ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్‌ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్‌ అతుల్‌ అభ్యంకర్‌ మాట్లాడుతూ... ‘‘బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం... ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే. వాటిలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్‌ ఏర్పడుతోంది. 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేయాలి’’ అని సూచించారు

8. జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య‌మే చేటు: య‌న‌మ‌ల‌

కొవిడ్ రెండో ద‌శ‌లో ఏపీ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు, ఆదాయాల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని తెదేపా సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు డిమాండ్ చేశారు. తొలిద‌శ‌లో ఏపీ ఆర్థిక వృద్ధిరేటు 4.3 శాతానికి ప‌డిపోయింద‌న్నారు. క‌రోనా రెండో ద‌శ‌లో ఏపీలో తిరోగ‌మ‌న వృద్ధి ఖాయమ‌ని చెప్పారు. క‌రోనా క‌న్నా జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య‌మే ఏపీకి చేటు చేసింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అభివృద్ధికి గండికొట్టి.. పేద‌ల ఉపాధి, రాబ‌డుల‌ను చావు దెబ్బ తీశార‌న్నారు. ద్ర‌వ్య‌లోటు, అధిక అప్పులే జ‌గ‌న్ ఘ‌న‌త అని ఎద్దేవా చేశారు.

9. Corona: తెలంగాణలోకి ఏపీ అంబులెన్స్‌లు

ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్‌ల‌ను తెలంగాణ‌లోకి అనుమ‌తిస్తున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌ద్ద‌ని తెలంగాణ ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు ఇవ్వ‌డంతో అంబులెన్స్‌ల‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. ముంద‌స్తు అనుమ‌తులు లేని అంబులెన్స్‌ల‌ను శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ వ‌ద‌ల‌ని తెలంగాణ‌ పోలీసులు హైకోర్టు ఆదేశాల‌తో.. రాత్రి 10 గంటల నుంచి అనుమతిస్తున్నారు. క‌ర్నూలు స‌మీపంలోని పుల్లూరు టోల్‌గేట్‌తో పాటు ఇత‌ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద అంబులెన్స్‌ల‌కు నిన్న‌ పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే.

10.Pfizer: భారత్‌కు 5కోట్ల డోసులు!

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి తాము తయారు చేసిన 50 మిలియన్ల కరోనా టీకా డోసుల్ని భారత్‌కు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా టీకాల కొరత కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అనేక రాష్ట్రాలు నేరుగా టీకాలను కొనుగోలు చేసేందుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని