Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 Apr 2024 13:03 IST

1. జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నెలాఖరునే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. పూర్తి కథనం

2. ‘ఉగ్రవాదులు పాక్‌ పారిపోయినా’..: రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్రంగా స్పందించారు. దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చిచెప్పారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు.పూర్తి కథనం

3. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. పూర్తి కథనం

4. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.పూర్తి కథనం

5. 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం: కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కార్యాలయంలో జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో భారాస రోజురోజుకు కనుమరుగవుతోందన్నారు.పూర్తి కథనం

6. అమెరికా దూరంగా ఉండు.. నెతన్యాహు ఉచ్చులో పడొద్దు..: ఇరాన్‌ మెసేజ్‌

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ (Iran) రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై జరిగిన గగనతల దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో ఇరాన్‌ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ (Israel)పై ఆ దేశం ఏక్షణమైనా దాడి చేయొచ్చనే అంచనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.పూర్తి కథనం

7. వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు

వేసవి సెలవులనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చే ప్రాంతం ఊటీ. పచ్చని ప్రకృతి, అందమైన సరస్సులు, ఎత్తయిన కొండల మధ్య ప్రయాణం ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రకృతి అందాలకు నెలవైన ఊటీలో ఈ వేసవిలో విడిది చేయాలనుకొనే వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని అందిస్తోంది.పూర్తి కథనం

8. రనౌట్‌ అప్పీలుపై వెనక్కి.. ధోనీని ఆలస్యంగా రప్పించేందుకేనా..?

ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్టార్‌ బ్యాటర్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే, అతడు ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండేదని.. హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ (Pat Cummins) నిర్ణయం వల్లే అలా జరగలేదని సోషల్ మీడియాలో చర్చకు తెరలేచింది. పూర్తి కథనం

9. భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా యత్నాలు.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన

సార్వత్రిక ఎన్నికల వేళ చైనా(China) అవాంతరాలు సృష్టించే ప్రమాదం ఉంది. అదే తరహాలో అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందుకు కృత్రిమ మేధ(AI)ను అస్త్రంగా చేసుకోనుందంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) హెచ్చరించింది. పూర్తి కథనం

10. ఇలాంటి పిచ్‌పై.. పవర్‌ప్లేలో దూకుడు అవసరం: అభిషేక్ శర్మ

ఉప్పల్‌ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై హైదరాబాద్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు శుభారంభం అందించడంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని