Hyderabad Vs Chennai: ఇలాంటి పిచ్‌పై.. పవర్‌ప్లేలో దూకుడు అవసరం: అభిషేక్ శర్మ

చెన్నై నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు సగం ఎనిమిది ఓవర్లలోపే వచ్చేసింది. దానికి కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడేశాడు.

Published : 06 Apr 2024 12:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్‌ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై హైదరాబాద్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు శుభారంభం అందించడంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీనిని ముగ్గురి కోసం అంకితం ఇస్తున్నట్లు అభిషేక్ తెలిపాడు. 

‘‘మేం బౌలింగ్‌ చేస్తున్నప్పుడే పిచ్‌ నెమ్మదిగా ఉందని అర్థమైంది. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. అందుకే, వేగంగా ఆడేందుకు ప్రయత్నించా. దీంతో మ్యాచ్‌పై మేం పట్టు సాధించాం. ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. వ్యక్తిగతంగా భారీ స్కోర్లు నమోదు చేయడం కంటే జట్టు విజయాలే ముఖ్యం. చెన్నైపై నా ఆటతీరు అలాగే సాగింది. ఈ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌, బ్రియాన్‌ లారా, మా నాన్నకు ధన్యవాదాలు చెబుతున్నా. ఈ అవార్డు వారికి అంకితం ఇస్తున్నా’’ అని అభిషేక్ శర్మ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 2024లో కనీసం 50 బంతులు ఆడిన బ్యాటర్ల బెస్ట్‌ స్ట్రైక్‌రేట్‌ కలిగిన ఆటగాడిగా అభిషేక్ (217.56) నిలిచాడు.

దూబెను అడ్డుకోవడానికి అలా ప్రయత్నించాం: కమిన్స్

‘‘పిచ్‌ తయారీలో నల్లమట్టిని వాడారు. దీంతో పరుగులు చేయడం చాలా ఇబ్బంది మారింది. శివమ్‌ దూబె స్పిన్నర్లపై ఎదురు దాడి చేశాడు. అతడికి ఆఫ్‌ కట్టర్లు వేసి కట్టడి చేశాం. చివరికి మేం విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌కు బౌలింగ్‌ చేయడం కష్టం. అభిమానుల మద్దతు అద్భుతం. ధోనీ క్రీజ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు స్టేడియం మార్మోగింది. ఇప్పటి వరకు అలా ఎప్పుడూ వినలేదు’’ అని హైదరాబాద్ సారథి కమిన్స్ (Pat Cummins) తెలిపాడు. 

చివరి ఐదు ఓవర్లే దెబ్బ కొట్టాయి: రుతురాజ్‌

‘‘హైదరాబాద్‌ బౌలర్లు చక్కగా బంతులేశారు. పిచ్‌ మందకొడిగా ఉండటంతో బాగా సద్వినియోగం చేసుకున్నారు. మ్యాచ్‌ను వారి నియంత్రణలోనే ఉంచుకొని.. మాకు అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఆరంభం బాగానే ఉన్నప్పటికీ కొనసాగించలేకపోయాం. మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ బాగా నెమ్మదించింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో క్యాచ్‌ను మిస్‌ చేయడం, పవర్‌ ప్లేలోని ఒక ఓవర్‌ భారీగా పరుగులు ఇచ్చేశాం. అయినా 19వ ఓవర్‌ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగాం. కనీసం 170-175 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మేం చివరి ఐదు ఓవర్లలో ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. మొయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు’’ అని చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని