Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 01 Dec 2021 13:03 IST

1.ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నగరమేదో తెలుసా?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ నగరం నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఆగస్టు.. సెప్టెంబర్‌ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు.

2.పాదయాత్రలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ పాదయాత్రను అడ్డుకుంటున్నారని నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రను ముందుకు సాగనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నినాదాలు చేశారు.

3.ఒమిక్రాన్‌.. గుట్టు విప్పేందుకు సీసీఎంబీకి

కొవిడ్‌ కొత్త రకం ఒమిక్రాన్‌పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో అనుభవం కలిగిన సీసీఎంబీ మరోసారి కొవిడ్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో ఐదు శాతం నమూనాలను వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, గాంధీ ఆసుపత్రి ల్యాబ్‌లకు పంపనున్నారు.

4.ఆ దేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా..!

ప్రమాదం పొంచి ఉన్న దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ జాబితాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించిన దేశాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరికి లక్షణాలు కనిపించలేదని, మరికొందరిలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది

5.మిత్రమా.. పాటకోసమే బతికావు: ఇళయరాజా

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం పట్ల ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం ప్రకటించారు. సీతారామశాస్త్రి మరణం తనను ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

6.ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : బాలాజీ

టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు,  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్‌ లక్ష్మిపతి బాలాజీ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌-2022 సీజన్‌ మెగా వేలానికి సంబంధించి.. సీఎస్కే ఫ్రాంఛైజీ రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించడానికి వచ్చిన బాలాజీ పలు విషయాలు వెల్లడించాడు.

ధోని తర్వాత చెన్నై కెప్టెన్‌ అతడే.! : రాబిన్‌ ఉతప్ప

7.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా.. టీమ్‌ ఏం చెప్పిందంటే..!

రామ్‌చరణ్‌, తారక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

8.లక్ష దిగువకు క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య అదుపులోనే ఉండటంతో.. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా లక్ష దిగువకు చేరి ఊరటనిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఒకపక్క కరోనా గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళన కొనసాగుతోంది.

9.ఆ మరణాలపై సమాచారం లేనప్పుడు.. సహాయం ప్రసక్తే లేదు

గత ఏడాది కాలంలో వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రైతుల మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుబాలకు ఆర్థిక సహాయం, వారిపై నమోదైన కేసులు వంటి విషయాలపై విపక్షాలు ప్రశ్నించాయి. దానిపై తోమర్ స్పందిస్తూ..‘ఆ అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదు. అలాంటప్పుడు సహాయం అనే దానికి తావే లేదు’ అని తోమర్ స్పష్టం చేశారు.

10.ఫిదా చేస్తోన్న ప్రభాస్‌-పూజా జోడీ.. లవ్‌ ఆంథమ్‌ వచ్చేసింది..!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, నటి పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్‌-పూజా మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రాధేశ్యామ్‌’ నుంచి లవ్‌ ఆంథమ్‌ని చిత్రబృందం విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని