Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 29 Jan 2022 17:02 IST

1.ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం : సబిత

తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలన్నింటినీ పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

2.జగన్‌ గారూ.. అక్కాచెల్లెమ్మలపై ఆప్యాయత ఎక్కడికి పోయింది?: లోకేశ్‌

రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘అక్కా చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్‌ గారూ?’ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలపై అకృత్యాలు పెరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ‘మద్యపాన నిషేధం’ వరమిస్తున్నానని గతంలో చెప్పిన సీఎం.. ప్రభుత్వంతోనే మద్యం విక్రయించడంపై ఏం సమాధానం చెబుతారని విమర్శించారు.

3.నిరుద్యోగులారా.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : కాంగ్రెస్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌ రావు క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను ముట్టడించిన కార్యకర్తలు పైకి ఎక్కి కాంగ్రెస్‌ జెండాను ప్రదర్శించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Revanth Reddy: కేసీఆర్‌ పాలనలో ప్రజలు అణచివేతకు, అభద్రతకు గురవుతున్నారు

4.సమ్మెకు వెళ్తామని తెలిసే బదిలీల ప్రకటన ఇచ్చారా?

ఏపీ వైద్యశాఖలో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వైద్యఉద్యోగుల సంఘం మండిపడింది. ఈ హడావిడి బదిలీలను వ్యతిరేకిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు తెలిపారు. పీఆర్సీపై వివిధ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న సమ్మెలోకి వెళ్తామని తెలిసే బదిలీల ప్రకటన ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ బదిలీలు చేపట్టినా.. ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

5.భారత్‌లో కరోనా ముప్పు తొలగిపోలేదు.. డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ.. మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నాయని, అయితే.. ఈ ట్రెండ్‌ను గమనించాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

6.దేశాన్ని బిగ్‌బాస్‌ షోలా మార్చేశారు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌ను భారత్‌ 2017లోనే ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తాజాగా న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలను పెంచాయి. స్పైవేర్‌ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అంటూ కేంద్రంపై దాడి చేశాయి.

7.బడ్జెట్‌ నుంచి వేతన జీవులు ఆశిస్తున్న వరాలివే..!

కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న తరుణంలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో 35-40 శాతం వాటా కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగులు.. కొత్త పద్దుపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా చతికిలబడిన తమ కుటుంబాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం నుంచి రాయితీలు, మినహాయింపులు కోరుతున్నారు.

China: పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి చైనా సహకారం

8.నా డ్రైవర్‌ లాంటి వ్యక్తి.. ఆయనతో నాకు పోటీనా..?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ పంజాబ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీల ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థిపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన డ్రైవర్‌తో సమానమంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

9.ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత..ఆష్లే బార్టీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో ఆమె అమెరికాకు చెందిన డానియెలీ రోజ్‌ కొలిన్స్‌ను ఓడించింది. 6-3, 7-6 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. రెంటో సెట్లో ఓ దశలో 1-5 తో వెనుకబడిపోయిన బార్టీ గొప్పగా పుంజుకుంది. కొలిన్స్‌ చేసిన అనవసర తప్పిదాలను సద్వినియోగం చేసుకుంది. వరుసగా రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చింది. దీంతో తన కెరీర్లో తొలిసారిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించింది.

10.‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌ విన్నారా..!

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బంగార్రాజు’. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు చెబుతూ నాగార్జున సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘బంగార్రాజు’ నుంచి ఓ సరికొత్త పాటను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని