Budget 2022: బడ్జెట్‌ నుంచి వేతన జీవులు ఆశిస్తున్న వరాలివే..!

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగులు బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా చతికిలబడిన తమ కుటుంబాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం నుంచి రాయితీలు, మినహాయింపులు కోరుతున్నారు.....

Published : 29 Jan 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న తరుణంలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో 35-40 శాతం వాటా కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగులు.. కొత్త పద్దుపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా చతికిలబడిన తమ కుటుంబాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం నుంచి రాయితీలు, మినహాయింపులు కోరుతున్నారు.

కొత్త ఆదాయ పన్ను విధానంలో మార్పులు..

ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధానాలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొత్త విధానాన్ని ఎంచుకున్న వారికి తక్కువ పన్ను రేటు వర్తిస్తుంది. కానీ, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌ వంటి మినహాయింపులు వర్తించవు. దీంతో చాలా మంది పాత విధానాన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విధానంలో అన్నీ కాకపోయినా.. కొన్ని కీలక మినహాయింపుల్ని చేర్చాలని వేతన జీవులు కోరుతున్నారు. అప్పుడు చాలా మంది కొత్త విధానాన్ని ఎంచుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు..

కొన్ని కేటగిరీల్లో చేసిన పెట్టుబడులపై ప్రస్తుతం గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు కోరే వెసులుబాటు ఉంది. అంటే జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, యాన్యుటీ పథకాలు, పీఎఫ్‌ జమ, కొన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్లు, ట్యూషన్‌ ఫీజు... వంటి వాటికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రూ.2,50,000 పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.

రూ.4 లక్షలు దాటితేనే పీఎఫ్‌పై వడ్డీ...

భవిష్య నిధి (PF) ఖాతాలో ఏటా చేసే జమ మొత్తం రూ.2.50 లక్షలు దాటితే... ఆపై జమ చేసిన సొమ్ముపై అందే వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. గత బడ్జెట్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, కొవిడ్‌ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు, వారి కుటుంబాలకు మరింత సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పరిమితిని.. కనీసం రూ.4 లక్షలకు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై స్పష్టత..

స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్లు సహా ఇతర పెట్టుబడి మార్గాలపై యువ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. రిస్క్‌ అధికంగా ఉన్నా.. రిటర్న్స్‌ ఎక్కువగా ఉండే మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీలోనూ మదుపు చేస్తున్నారు. అయితే, ఈ రంగంలో పెద్ద అనిశ్చితి నెలకొంది. క్రిప్టో నియంత్రణకు బిల్లు తేబోతున్నారంటూ శీతాకాల పార్లమెంటు సమావేశాల సమయంలో వార్తలు వచ్చాయి. అలాగే క్రిప్టోల్లో పెట్టుబడుల్ని నిషేధిస్తారా? లేక దీన్ని ఒక ‘పెట్టుబడి సాధనం’గా గుర్తించి పన్ను విధిస్తారా? అనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో క్రిప్టో పెట్టుబడులపై నెలకొన్న అనిశ్చితిని బడ్జెట్‌లో ప్రకటన ద్వారా తొలగించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

రూ.3,00,000 హోంలోన్‌ వడ్డీకి మినహాయంపు..

వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటంతో చాలామంది గృహరుణంతో ఇల్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ రుణానికి చెల్లించే వడ్డీకి ప్రస్తుతం రూ.2లక్షల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. దీన్ని మరో రూ.లక్ష మేరకు పెంచాలని కోరుతున్నారు. అదే సమయంలో హెచ్‌ఆర్‌ఏ లేని వారికి ఇంటి అద్దెకు ఇస్తున్న మినహాయింపునూ రూ.1,50,000 చేయాలని వేతన జీవులు ఆర్థిక మంత్రికి విన్నవిస్తున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మినహాయింపులు..

కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంట్లోనే ఆఫీసు వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఫర్నీచర్‌, ఇంటర్నెట్‌ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని