Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 10 Jul 2022 17:07 IST

1. వర్ష ప్రభావం.. విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలకు రేపట్నుంచి మూడు రోజులపాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.  పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడో రోజు కూడా ముసురు కొనసాగుతోంది.

2. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. 80 స్థానాల్లో గెలుపే లక్ష్యం: మాణికం ఠాగూర్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం మాణికం ఠాగూర్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. దీనిపై విస్తృతంగా చర్చించాం. సిరిసిల్లలో ఏర్పాటుచేసే రాహుల్ గాంధీ సభపైనా చర్చించాం’ అని తెలిపారు.


Video: జోరువాన.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మేడారం జంపన్న వాగు


3. ఆపరేషన్‌ ఆకర్ష్‌.. తెరాసకు దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వాలని భాజపా వ్యూహరచన

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించాలని భాజపా పిలుపునిచ్చింది. భాజపా భరోసా యాత్ర పేరుతో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో అక్కడ చేరికలపై దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతమయ్యే వరకు పేర్లు బయట పెట్టొద్దని భావిస్తున్నారు.

4. ఈ ఒక్క సీన్‌ మొదట అనుకున్నట్లు తీసి ఉంటే.. మరో రేంజ్‌లో ఉండేది

‘బాహుబలి’ (Baahubali) తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేసిన చిత్రం. రూ.100కోట్లు వసూలు చేయడం గొప్పగా చెప్పుకునే సందర్భంలో రూ.1000కోట్ల మార్కును దాటేసి, రికార్డులు తిరగరాసింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. రాజమౌళి టేకింగ్‌, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరావర్క్‌ ఇలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జులై 10న 2015న విడుదలైన ‘బాహుబలి:ది బిగినింగ్‌’ ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

5. బక్కోడే కానీ.. గట్టోడు.. ఈ భువనేశ్వరుడు

డేంజరస్‌ బ్యాటర్‌ క్రీజ్‌లో ఉంటే ఎంతటి బౌలరైనా కాసింత ఆందోళనగానే ఉంటాడు. అయితే అవేవీ తన మొహంలో కనిపించనీయకుండా తనదైన శైలిలో వికెట్లే లక్ష్యంగా బంతులను సంధించే భువనేశ్వర్‌ కుమార్‌ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారీ హిట్టర్లు కలిగిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడమంటే ఆషామాషీ కాదు. మరోవైపు భారత టీ20 లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుడు, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి బట్లర్‌ను రెండు మ్యాచుల్లోనూ భువీనే పెవిలియన్‌కు చేర్చడం విశేషం.


Viral Video: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బియ్యం లారీ!


6. గొటబాయ నివాసంలో ఎంత డబ్బు దొరికింది?

శ్రీలంకలో ప్రభుత్వంపై ఆగ్రహంతో అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఇంకా అక్కడే ఉన్నారు. భవనంలోని సౌకర్యాలను అనుభవిస్తున్న నిరసనకారులు అక్కడే వంటావార్పు చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు భవనంలో రూ.కోటి రూపాయలకు పైగా విలువ చేసే నోట్ల కట్టలను ఆందోళనకారులు గుర్తించినట్లు డైలీ మిర్రర్‌ అనే పత్రిక పేర్కొంది.

7. 81 మంది దిల్లీ జైలు సిబ్బందికి సుఖేష్‌ నుంచి లంచాలు..!

మోసగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ దిల్లీలోని రోహిణి జైలు సిబ్బందికి భారీ ఎత్తున లంచాలు ఇచ్చాడు. సుఖేష్‌ దగ్గర సొమ్ము తీసుకున్న అధికారుల జాబితా భారీగానే ఉంది. అతడు ఆ ధైర్యంతోనే జైల్లో ఉంటూనే మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అధికారులే అతడికి మొబైల్‌ ఫోన్లు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు గుర్తించారు. సదరు జైల్లోని 81 మందికిపైగా అధికారులకు సుఖేష్‌ నుంచి డబ్బు అందింది. ఈ మేరకు దిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

8. తగ్గిన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగం

డాలర్‌ బలపడడం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లను వీడుతూనే ఉన్నారు. జులై నెలలో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. అయితే, గత కొన్ని వారాలుగా ఉపసంహరణ వేగం తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 100 డాలర్ల సమీపానికి చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి.


Video: శ్రీలంకలో ఇంకా చల్లారని ప్రజాగ్రహం


9. పాంటింగ్‌ను రోహిత్‌ సమం చేసే అవకాశం.. రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం ఇస్తారా?

ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు టీ20లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ ఇవాళ ఆఖరి మ్యాచ్‌ ఆడనుంది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ఇండియా ఉవ్విళ్లూరుతోంది. తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను పరీక్షించే అవకాశం లేకపోలేదు. ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ను చివరి మ్యాచ్‌లో ఆడించే ఛాన్స్‌ ఉంది.

10. హైదరాబాద్‌లో అదృశ్యం.. ముంబయిలో ప్రత్యక్షం!

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ప్రైవేటు కళాశాల విద్యార్థిని వర్షిణి అదృశ్యం కథ సుఖాంతం అయింది. ముంబయిలో విద్యార్థిని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. మిడ్‌ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు మోహన్‌రెడ్డి కళాశాలకు తీసుకెళ్లారు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్‌ ఇంట్లో మరిచిపోయానని చెప్పి ఆమె క్యాంపస్‌ నుంచి తిరిగి బయటకు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని