FPI: తగ్గిన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగం

డాలర్‌ బలపడడం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో విదేశీ మదుపర్లకు భారత్‌ మార్కెట్లను వీడుతూనే ఉన్నారు....

Published : 10 Jul 2022 15:20 IST

దిల్లీ: డాలర్‌ బలపడడం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వంటి కారణాలతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లను వీడుతూనే ఉన్నారు. జులై నెలలో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. అయితే, గత కొన్ని వారాలుగా ఉపసంహరణ వేగం తగ్గడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 100 డాలర్ల సమీపానికి చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రూపాయి పతనాన్ని ఆపేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగడం మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. దీంతో గతవారం మార్కెట్‌లో కొంత ర్యాలీ కనిపించింది. అయితే, మార్కెట్లలో గడ్డు పరిస్థితులు ముగిశాయనడానికి ఎఫ్‌పీఐ ఉపసంహరణ తగ్గడం ఏమాత్రం సంకేతం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచించే స్థూల కారణాల్లో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదని వివరించారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

ద్రవ్యోల్బణం ముగిసినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డ తర్వాతే ఎఫ్‌పీఐలు తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశిస్తారని యెస్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ అనలిస్ట్‌ హితేశ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల తగ్గుముఖం పడితే కేంద్ర బ్యాంకులు సైతం రేట్ల పెంపు విషయంలో కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితులు ఆగస్టు-సెప్టెంబరు త్రైమాసికంలో చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

డిపాజిటరీస్‌ వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. జులై 1-8 మధ్య ఎఫ్‌పీఐలు రూ.4,096 కోట్లు విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. జులై 6న రూ.2,100 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు చేశారు. గతకొన్ని వారాల్లో ఈ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం ఇదే తొలిసారి. జూన్‌లో మొత్తంగా విదేశీ మదుపర్లు రూ.50,203 కోట్లు ఉపసంహరించుకున్నారు. మార్చి 2020 తర్వాత ఇంత పెద్దఎత్తున పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పతనమవుతూ వస్తోంది. ఇటీవల రూ.79 మార్క్‌ను దాటి జీవితకాల కనిష్ఠానికి చేరింది. భారత్‌తో పాటు వర్ధమాన మార్కట్లయిన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌ నుంచి కూడా మదుపర్లు పెట్టుబడులను ఉపంహరించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని