Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Jun 2023 21:00 IST

1. ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామంలో సుమారు 60 మంది విద్యార్థులున్నా పాఠశాల లేదంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్‌కుమార్‌కు విశాఖపట్నం మర్రిపాలెంలో ఉన్న 17,135 చ.మీ. భూమిని వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 115 జారీ చేసింది. గతంలో ఈ జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఏడు బోగీలు బోల్తా!

ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న గూడ్సు రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 50మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తగ్గనున్న వంట నూనెల ధరలు

దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు (Edible oil prices) తగ్గుముఖం పట్టనున్నాయి. నూనెల ధరలు తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం వంట నూనెల పరిశ్రమలకు సూచించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఒక్కో లీటర్‌కు రూ.8-12  వరకు తగ్గించాలని పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో నూనెల ధరలు తగ్గించాలని సూచించినట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మణిపుర్‌ కల్లోలం.. అమిత్‌ షా వార్నింగ్ ఎఫెక్ట్‌ కనిపిస్తోందా..?

ఇటీవల ఘర్షణల్లో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన ప్రభావం కనిపిస్తోంది. ఆయన నిన్న శాంతి ప్రణాళిక ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేస్తామని చెప్పారు. ఈ క్రమంలో మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను తొలగించగా, మరికొన్ని ప్రాంతాల్లో సడలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మస్క్‌ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్‌!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. కంపెనీకి సంబంధించిన విషయాలను నిత్యం ఫాలోవర్స్‌తో షేర్‌ చేస్తుంటారు. అంతేకాదు, కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఫాలోవర్ల అభిప్రాయం కోరుతుంటారు. కొన్నిసార్లు ఆయన చేసే ట్వీట్‌ల సారాంశం అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా ఆయన తన మూడేళ్ల కొడుకు ఎక్స్‌ ఏఈ (X AE A-XII) తనను అడిగిన ప్రశ్నను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్‌ టికాయత్‌ హెచ్చరిక

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ‘రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్‌ ఠాకూర్‌

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ‘‘నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్‌

దాయాది దేశం పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(PTI)  పార్టీ అధినేత  ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)..1500 కోట్ల పాకిస్థానీ రూపాయల పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జవాబుదారీ బ్యూరో(NAB)పై ఈ కేసు వేయనున్నారు. గత నెల జరిగిన అరెస్టు వల్ల తన ప్రతిష్ఠ తీవ్ర భంగం కలిగిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!

తన పార్శిల్‌ ఎక్కడుందో తెలుసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తి.. సదరు కొరియర్‌ సంస్థ పేరును ఆన్‌లైన్‌లో తప్పుగా టైప్‌ చేసి, ఈ క్రమంలోనే రూ.లక్ష పోగొట్టుకున్నారు. ముంబయి (Mumbai)లో ఈ వ్యవహారం (Cyber Crime) వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి మలాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి (69) ఇటీవల బెంగళూరు నుంచి ముంబయికి వచ్చారు. తనవద్ద ఉన్న అదనపు లగేజీని ముందుగానే కొరియర్‌ (Courier)లో పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని